శ్రీసుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 

ఈరోజు పరమపవిత్రమయిన శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి. స్వామి ఆరోగ్యప్రదాత, జ్ఞానప్రదాత, సంతానప్రదాత. తండ్రికే ప్రణవం గురించి బోధనచేసిన గురుగుహ.

ఆశ్చర్యకరం ఏమిటంటే అష్టోత్తర శతనామావళి పూజ చేస్తూ స్వామిని " పార్వతీ ప్రియనందనాయనమః, గంగా సుతాయనమః " అని పూజిస్తాం. ఇద్దరికీ కుమారుడు.

సుబ్రహ్మణ్యునికి నామకరణం చేయించడానికి ఏ మహర్షిని పిలుద్దామా అని ఆలోచన చేస్తూన్నప్పుడు విశ్వామిత్రమహర్షిని పిలిపించమని సుబ్రహ్మణ్యస్వామే చెప్పారుట. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయి " ఎందరో పెద్దలు ఉండగా నాకీ అవకాశం ఇచ్చారా స్వామి " అని అడిగారుట. స్వామి ఋషిని పెద్దవారిని చేయడానికి ఆ అవకాశం ఇచ్చి ఉంటారు. కాని విశ్వామిత్రుడు ఏ పేరు పెట్టారు స్వామికి అని పురాణాలలో ఎక్కడా లేదు అని తెలియచేసారు పూజ్యులు సామవేదంవారు.

వ్యాసర్షి తన శిష్యుడు సూతుడికి చెప్పిన అద్భుత పురాణం " స్కాందపురాణం ". దీనికి పేరు స్కందునిది అయినా ఆయన గురించి తక్కువగానే ఉంటుంది. ఇది 18 పురాణాలలో అతి పెద్దది. దీనిలో 7 ఖండాలు ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఖండాలద్వారా ముగ్గురూ సమానులని తెలియచేస్తూంది ఈపురాణం. క్రితంనెలలో అందరూ పారాయణ చేసిన " కార్తీకపురాణం " దీనిలోనిదే.

మనదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల వివరాలు, ప్రత్యేకతలు, సందర్శించిన కలిగే ఫలితాలు దీనిలో వివరంగా ఉన్నాయి.

ఇక ఈ పురాణంలోని కాశీఖండం ఒక అద్భుతం. దానిలోని ద్వాదశాదిత్యుల వివరాలు విదేశీపండితులను సహితం ఆశ్చర్యపోయేలా చేసాయి.

కాశీఖండంలో ఉన్న విషయాలు - కాశీకి చుట్టూ నిర్ణీతప్రదేశాల్లో 12 సూర్యదేవాలయాలు ఉన్నాయి. అవి కాశీకి ఎంతెంతదూరంలో ఉన్నాయి, సూర్యకిరణాలు ఏకోణంలో ఏవేడితో ఏశక్తితో వాటిమీద పడతాయో స్పష్టంగా ఉన్నాయి. సూర్యుడు ఒక్కోమాసం ఒక్కోరాశిలో ఉంటారని మనకు తెలుసు. సూర్యుడు ఒక్కోరాశిలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కో గుడిలో ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. 

ఈ గుడులమీద ఎన్నో పరిశోధనాపత్రాలను విడుదలచేసిన " జాన్ ఎం మాల్విలె ( John M Malville ) " అనే అమెరికా కాస్మాలజీ ( కాస్మిక్ ఎనర్జీ ) ప్రొఫెసర్ చివరలో అన్నది " ఎంతటి అద్భుతవిజ్ఞానము, మానవమాత్రులకు సాధ్యంకాదిది. ఋషులు తమ దివ్యచక్షువులతో దర్శించి తెలుసుకున్నవో లేక ధ్యానంలో కూర్చుని గ్రహించిన దైవదత్త విషయాలో ఇవన్నీను. ఏమాత్రం సందేహమే లేదు " అని.

వేల ఏళ్ళక్రితమే ఎంతటి అద్భుత విజ్ఞానం. అదీ మన ఋషుల విద్వత్తు.

ఆదిశంకరులకు తిరుచెందూర్ లో ఆరోగ్యాన్ని ప్రసాదించారు స్వామి.

ముత్తుస్వామి దీక్షితార్ ని తిరుత్తణిలో అనుగ్రహించారు సుబ్రహ్మణ్యస్వామి. అప్పటినుంచీ ఆయన కీర్తనలలో " గురుగుహ " అనే పదం చేరుతూ వచ్చింది.

పూజ్యగురువులు గరికిపాటివారు ప్రవచనం చేస్తూ సుబ్రహ్మణ్యతత్వం గురించి చెప్పారు. విష్ణుసహస్రంలో ఓ శ్లోకం ఉంది:

" బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ 

  బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః, 

  బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ 

  బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః " 

ఇది విష్ణుతత్వం. ఈశ్లోకంలో ప్రతీ పదానికీ ముందు " సు " చేరిస్తే అదే సుబ్రహ్మణ్యతత్వం అన్నారు.

" సుబ్రహ్మణ్యో  

  సుబ్రహ్మకృద్ ......

  ...........సుబ్రాహ్మణప్రియః "

ఎంత అద్భుతం మన వాజ్మయం. 

శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామినే నమః.

స్వామిని అందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించమని కోరుకుందాం - సూర్య. 

అందరికీ శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి శుభాకాంక్షలు.

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ