అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మన కోరికలన్నిటినీ అమ్మవారే తీరుస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ప్రియంకరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 731 వ నామం.

" ప్రియంకరీ " అంటే భక్తులకు ఇష్టమును చేయునది. భక్తులంటే మహా ప్రేమ. భక్తులకు విపరీతమయిన కోరికలు ఉండవు. మాటలు సాత్వికంగా ఉంటాయి. మంచివారితో కలిసి తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ అనుగ్రహిస్తారు అమ్మవారు.

విష్ణుసహస్రనామస్తోత్రంలో " ప్రియకృత్ " అని ఒక నామం. దానికి శంకరులు " భక్తులు కోరిన కోరికలు తీర్చువారు " అని భాష్యం చెప్పారు.

కంసుడు కృష్ణబలరాములను చంపించేయాలనుకుంటాడు. కంసుడు ఆజ్ఞాపించినట్లుగా అక్రూరుడు బృందావనం వెళ్ళి కృష్ణబలరాములను వెంటబెట్టుకొని మధురకి వస్తారు. మాకు కొంచెం పనులున్నాయని చెప్పి నగరం మొదట్లోనే రథం దిగిపోతారు కృష్ణబలరాములు. 

కృష్ణుడు బలరాముడితో కలిసి ఓ ఇంటికి వెళ్ళి తలుపు తడతారు. ఒకతను తలుపుతీసి వీరిని చూసి దిగ్భ్రమ చెందుతాడు. నోట మాటరాలేదు. అలా ఉండిపోయాడు.

అతని పేరు సుదాముడు - దామం అంటే దండ. పూలదండలు కట్టి మొదటి దండ కృష్ణుడికని ప్రక్కన పెట్టి మిగతావి అమ్ముకుని జీవిస్తూంటాడు. పరమ కృష్ణభక్తుడు. అంతవరకూ మధురలో ఎవరూ కృష్ణుడిని చూడలేదు. కృష్ణగాధలు విని భక్తులయినవారే అందరూ.

తనకోసం ప్రక్కన పెట్టిన దండను ధరించి పరమ సంతుష్టుడయిన కృష్ణుడు ఏమి కావాలో కోరుకో అంటారు. అప్పుడు సుదాముడు కోరుకున్నది:

" సోఽపి వవ్రేఽచలాం భక్తిం 

  తస్మిన్నేవాఖిలాత్మని . 

  తద్భక్తేషు చ సౌహార్దం 

  భూతేషు చ దయాం పరాం "

     - భాగవతం 10(1):41:51

" విశ్వవ్యాపకుడయిన పరమాత్మ యందు అచంచలమయిన భక్తి, భగవత్భక్తుల సాంగత్యం, అన్ని ఇతర జీవులయందు దయ కలిగి ఉండడం అనుగ్రహించు స్వామి " అని కోరుకున్నాడు. భగవద్ భక్తుల సాంగత్యం కోరుకున్నాడు. అంటే ఎల్లప్పుడూ భగవత్స్పృహలోనే ఉండడానికి.

ఎంతటి అద్భుతమయిన కోరికలు. అలా కోరుకుంటే భగవంతుడు పరవశించిపోరూ.

అందుకే కృష్ణుడు అతను కోరిన కోరికలతో పాటు సంపద, వంశాభివృద్ధి, బలం, యశస్సు, ఆయుష్షు, కాంతిని ప్రసాదించారు. 

భక్తుల దగ్గరకు అమ్మవారే వెతుక్కుంటూ వెళ్ళి మరీ అనుగ్రహిస్తారు. మనం చేయవలసినది శరణాగతి మాత్రమే.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ