అమ్మవారు 84 లక్షల జీవరాశుల బాగోగులను చూసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః "🙏
" సర్వతోముఖీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 532 వ నామం.
" సర్వతోముఖీ ," అంటే సంపూర్ణస్వరూపం. అన్నివేపులకు ముఖములు కలిగినది అని అర్ధం.
శ్రీసూక్తంలో అమ్మవారిని " లోకైక దీపాంకురాం " అని స్తుతిస్తాం. లోకాలన్నిటినీ రక్షిస్తూన్న ఒకే దీపమై ఉన్న చల్లని తల్లి. దీపం ఏ వైపు చూస్తూందని అడిగితే ఏమి చెబుతాం. అదీ అమ్మవారి స్వరూపం.
విష్ణుసహస్రంలో ఓ అద్భుత శ్లోకం ఉంది:
" విశ్వమూర్తిః మహామూర్తిః
దీప్తమూర్తిరమూర్తివాన్,
అనేకమూర్తిరవ్యక్తః
శతమూర్తిః శతాననః "
దీనిలో భగవంతుని రూపాన్ని పూర్తిగా తెలియచేయడం జరిగింది.
ఈ రూపాన్ని దర్శించాలంటే భగవద్గీతలోని అర్జునుడు పరమాత్మని ఉద్దేశించి చేసిన ప్రార్ధన తెలుసుకోవాలి:
" నమః పురస్తాదధ పృష్ఠతస్తే,
నమో2స్తు తే సర్వత ఏవ సర్వ,
అనంతవీర్యామిత విక్రమస్త్వం,
సర్వం సమాప్నోషి తతో2సి సర్వః "
- భ.గీ. 11- 40.
" పరమాత్మా నీకు ఎదురుకుండా, వెనకనుండి, అన్నివైపులనుండీ నమస్కరిస్తున్నాను. నీవు అమిత పరాక్రమశాలివై అన్నివైపులా జగత్తంతా వ్యాపించి ఉన్నావు. అన్నిరూపములూ నీవే "
అని అంటారు అర్జునుడు స్వామితో విశ్వరూపం సందర్శనసమయంలో.
84 లక్షల జీవరాశుల బాగోగులను సదా చూసుకోవాలంటే అమ్మవారు అన్నివైపులా అన్నివేళలా చూసుకుంటూనే ఉండాలి కదా.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment