అక్షరం అమ్మవారి రూపం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" వర్ణరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 850 వ నామం. 

" వర్ణరూపిణీ " అంటే అక్షరస్వరూపిణి.

" ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ " - ఒకటే అక్షరం, అది ఓం, అదే బ్రహ్మ/సత్యం. అమ్మవారి నుంచి ఓం వచ్చింది, ఓం నుంచి అన్ని అక్షరాలు వచ్చాయి. అక్షరాలనుంచే సృష్టి అంతా జరిగింది. ప్రళయకాలంలో మళ్ళీ సృష్టి అంతా అక్షరాలలోనూ, అక్షరాలు ఓంలోనూ, ఓం అమ్మవారిలోనూ లీనమవుతాయి. 

అక్షరం పదమే ఒక అద్భుతం. క్షరం అంటే నాశనమయేది. అక్షరం అంటే నాశనం లేనిది. ఎంత చక్కటి పేరు పెట్టారు.

అక్షరం ని అమ్మవారుగా భావించి కొలిచే అద్భుత సంప్రదాయాన్ని మనకు ఇచ్చింది మన సనాతనధర్మం. అక్షరాభ్యాసం దగ్గరనుంచి పిల్లలకు చదువులతల్లి సరస్వతీదేవిని ఎలా గౌరవించాలో నేర్పించడం, పుస్తకాలను ఎంత జాగ్రత్తగా గౌరవప్రదంగా ఉంచుకోవాలో నేర్పడం కూడా జరుగుతూంది. 

పిల్లలకు అక్షరాభ్యాసం చేసినప్పుడు బియ్యంమీద ఓం నమశ్శివాయ అని వ్రాయిస్తారు. బియ్యంమీదనే ఎందుకని. బియ్యం చంద్రుడి రూపం. " చంద్రమా మనసో జాతః - చంద్రుడినుండి మనస్సు పుట్టింది " అని తెలియచేస్తూంది పురు‌షసూక్తం. అంటే తెల్లకాగితం వంటి పిల్లల మనస్సు మీద ఓం నమశ్శివాయ అని వ్రాయిస్తున్నారు మొదటిసారి. ఎంత అద్భుత సంస్కృతి మనది. 

ఒక్కో అక్షరానికి ఒక అధిదేవత. ఆ దేవతకు ఒక ప్రత్యేకమయిన పూజ, నైవేద్యం. ఇటువంటి సాటిలేని అద్భుత సంస్కృతి వలననే భారతదేశం ప్రపంచపటంలో వేల సంవత్సరాలుగా ఉన్నత స్థానంలో నిలబడతూంది. 

" నాన్యపంథా అయనాయ విద్యతే - పురుషసూక్తం " -వేరే దారి లేదు, మన సనాతనధర్మమే ప్రపంచశాంతికి దిక్కు. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ