అమ్మవారి మూడవ కన్ను ఎరుపు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" త్రిలోచనా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 477 వ నామం .

" త్రిలోచనా " అంటే 3 నేత్రములు గలది అమ్మవారు అని. 

అమ్మవారి రెండు కళ్ళు సూర్యచంద్రులు. జీవులను సదా రక్షిస్తూ ఉంటారు ఈ కళ్ళతో. మూడవ కన్ను అగ్ని. దుష్టులను శిక్షిస్తూ ఉంటారు ఈ కన్నుతో. ఈ మూడవ కన్ను కొద్దిగా ఎరుపురంగులో ఉంటుంది. 

ఈ మూడవ కన్ను ఎరుపురంగు గురించి ఆదిశంకరులు సౌందర్యలహరిలో అద్భుత వివరణ ఇచ్చారు:

" కవీనాం సందర్భస్తబక ....

  ...అసూయాసంసర్గాదళిక 

  నయనం కించిదరుణం " 

      - సౌందర్యలహరి : 50

శ్రీశంకరాచార్యులవారు సౌందర్యలహరి గానం చేస్తూ " అసూయాసంసర్గాత్ అళికనయనం కించిత్ అరుణం - నీ నుదుటిమీద ఉన్న మూడవకన్ను అసూయతో కొంచెం ఎర్రబడింది తల్లీ " అన్నారు పై శ్లోకంలో.

మాగ్రామంలో ప్రతీ సంవత్సరం శ్రీశారదాదేవీనవరాత్రులు చేస్తారు. మొదలుపెట్టి సుమారు 66 ఏళ్ళు పైన అయింది. పగలంతా ఉపవాసం. రోజూ చండీహోమం జరుగుతుంది. రాత్రి సహస్రనామపూజ, మహానివేదనం, తాంబూలం, మహామంత్రపుష్పం, చామరసేవ అయాక వేదపారాయణ జరుగుతుంది. 

అమ్మవారు సృష్టి బాగోగులన్నీ చూసి కొంచెం అలసి ( అభిమాన సద్భావన ) ఉంటారు ఆసమయానికి. తాంబూలసేవన చేస్తూ చిరునవ్వుతో భక్తులను ప్రేమగా చూస్తూ ఉంటారు.

" ఋగ్వేదం అవధారయ " అనగానే ఋగ్వేద పండితుడు ఋగ్వేదాన్ని ఆలపిస్తాడు. యజుర్వేదం అవధారయ అనగానే యజుర్వేద పండితుడు, సామవేదం అవధారయ అనగానే సామవేదపండితుడు గానం చేస్తారు. అమ్మవారు చిరునవ్వుతో ఆలకిస్తూ ఉంటారు.

అమ్మవారు చెవులతో కదా వింటారు. అసలే ఆమ్మవారిని " ఆకర్ణ దీర్ఘ నయనం " అంటే చెవులవరకూ ఉన్న పెద్దకనులు కలది అంటారు. ఈ చెవులు ఎంత అదృష్టం చేసుకున్నాయి, ఆనందంగా వేదపారాయణ వింటూ తరిస్తున్నాయి అనుకుని ఈ రెండు కళ్ళూ ఇంకొంచెం సాగి చెవులతో కలిసి వేదఘోష వింటున్నాయిట. మరి నుదిటిమీద ఉన్న మూడవ కన్ను మాటేమిటి. చెవులదాకా సాగలేదుకదా. అందుకని మిగతా రెండు కళ్ళమీద అసూయ కలగడం , కన్ను " కొంచెం ( కించిత్ )" ఎర్రబడడం జరిగిందని శంకరుల భావన. ఎంత అద్భుత భావన.

అమ్మవారికి తన పిల్లలపై కోపమెందుకు ఉంటుంది అన్నట్లుగా శంకరులు ఈవిధంగా వివరించారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ