మకరసంక్రాంతి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" విశ్వప్రియే విష్ణుమనో2నుకూలే
తత్పాదపద్మం మయిసన్నిధత్స్వ"
- శ్రీసూక్తం.
" నీ పాదపద్మమును నాపై ఉంచి కటాక్షించు తల్లీ " అని ప్రార్ధిస్తాం అమ్మవారిని.
మూకకవి/మూకశంకరులు కంచికామాక్షీ అమ్మవారి దర్శనకటాక్షంతో ఆసువుగా 500 శ్లోకాలతో అమ్మవారిని ప్రార్ధన చేసారు. అది " మూకపంచశతి " గా ప్రసిద్ధిచెందింది. దానిలో అమ్మవారి పాదపద్మాలను 100 శ్లోకాలతో స్తుతించారు.
ఇలా పాదాలను ఆశ్రయించడం/స్తుతించడం ఏమిటీ అని చాలామందికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.
భగవద్గీత గురించి ప్రవచనం చేస్తూ ఒక పండితులు దీని గురించి ఒక అద్భుతమయిన విషయం తెలియచేసారు.
" వలలో పడ్డాడు పాపం " అంటూంటారు ఎవరయినా మాయకు/మోసానికి లోనయితే. అమ్మవారు జీవులందరూ ఉత్తీర్ణులవాలని అన్ని అవకాశాలనూ కలిగిస్తుంది కాని ఆవిడపెట్టే పరీక్షలు కొంచెం కఠినంగానే ఉంటాయి.
ఎల్కెజీలో చేరడానికే ఎన్నో పరీక్షలు పెడుతూంటే ముక్తి/మోక్షం పొందడానికి అమ్మవారు పెట్టే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి జీవుడు.
ఒక చేపలు పట్టేవాడు నదికి వెడతాడు. 5/6 అడుగులు నీటిలోపలికి వెళ్ళి పెద్ద వలని విసురుతాడు. మెల్లిగా వలను తనవేపు లాగుతాడు. చేపలు వలలో చిక్కుకుని అతని బుట్టలోకి చేరుతాయి. కొన్నిచేపలు అతని పాదాల దగ్గర తిరుగుతూంటాయి. వాటికి " వల " వల్ల భయమూ, ప్రమాదమూ రెండూ ఉండవు. లాగేటప్పుడు వల అతని పాదాలవరకూ రాదు కనుక.
అలాగే అమ్మవారి పాదాలదగ్గర ఉన్నవారికి ఆవిడ పరీక్షించడానికి విసిరే " వల ( మాయ ) " వల్ల భయమేమి ఉంటుంది?. అందుకే అమ్మవారిపాదాలు నమ్ముకున్నవారికి ఏ భయాలు ఉండవని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి.
" మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే,
తతఃకిం,తతఃకిం తతఃకిం తతఃకిం "
- " ఎన్ని ఉన్నా గురువుగారి పాదపద్మాలమీద మనస్సు లగ్నం కానప్పుడు ఉపయోగమేమిటి " అన్నారు ఆదిశంకరులు. అమ్మవారు గురురూపిణి. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
సుఖమయ జీవితానికి అందరం అమ్మపాదాలని ఆశ్రయిద్దాం.
మకరసంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతిలక్ష్మిని అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment