అమ్మవారు కంటిచూపుతో అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 590 వ నామం.
" కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా " అంటే క్రీగంటిచూపులకు సేవకురాండ్రుగా అయిన కోట్లగలదీ లక్ష్మీదేవులచే సేవింపబడుతున్నది అని భాష్యం చెప్పారు.
ఇక్కడ లక్ష్మీదేవులు అంటే దేవతాస్త్రీలు, భక్తులు అని తెలుసుకోవాలి. ఎవరిమీద అమ్మవారి చూపు కొంచమయిననూ పడుతుందో వారిని బ్రహ్మగారు ఉన్నంతవరకూ అంటే ప్రళయకాలం వరకూ లక్ష్మీదేవి అనుగ్రహిస్తారు అని తాత్పర్యం.
కంచి కామాక్షీదేవి కంటి చూపుతో అనుగ్రహిస్తారు. అమ్మవారు అనుగ్రహించలేనిది ఏమీలేదు.
ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:
" దృశా ద్రాఘీయస్యా
దరదళిత నీలోత్పలరుచా,
దనీయాంసం దీనం స్నపయ
కృపయా మామపి శివే,
అనేనా అయం ధన్యో
భవతి న చ తేహానిరియతే,
వనేవా హర్మ్యేవా సమకర
నిపాతో హిమకరః "
" అమ్మా నేనెక్కడో దూరంగా చివరలో ఉంటాను ( యోగులు అంటే సనకసనందాదులు , నారదుడు వంటివారు ఆవిడకు దగ్గరగా ముందు వరుసలో ఉంటారని, అయోగ్యులు ఎక్కడో వెనుకవరుసలో ఉంటారని భావం ), నీ కన్నులు చాలాపెద్దవి కనుక నీ చూపుని నామీద కూడా పడేలా చూడమ్మా. యోగులనే చూస్తాను, అనుగ్రహిస్తాను అని అనకమ్మా ఎందుకంటే చంద్రకాంతి మేడలమీద అడవిలోనూ సమంగానే ప్రసరిస్తుంది కదమ్మా. ఈ అయోగ్యుణ్ణి అనుగ్రహించడం వల్ల నీకు వచ్చే నష్టమేమీ ఉండదు కాని ఈ అయోగ్యుడికి ఎంతో లాభమమ్మా " అని అంటారు శంకరులు.
అమ్మవారి చూపు అంతటి ఎనలేని అనుగ్రహంని ప్రసాదిస్తుంది. శంకరులే అలా ప్రార్ధించారంటే తెలుస్తూనే ఉంది సాధన ఎంత అధికంగా ఉండాలో.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment