అమ్మవారు అనుకోవాలి, అనుగ్రహిద్దామని - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" అదృశ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 649 వ నామం .

" అదృశ్యా " అంటే ఇంద్రియములకు కనబడనిది. అమ్మవారు కోటిసూర్య సమప్రభ. మధ్యాహ్నం సూర్యుడిని ఎలాగూ చూడలేము. ఉదయం సాయంకాలం సూర్యుడినే నేరుగా చూడలేము కదా. అమ్మవారిని ఎలా చూడగలం మన కంటితో.

దర్శనం ఇద్దామని అమ్మవారు అనుకోవాలి. మనం కోరుకోవడం కాదు. అనన్యభక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. సందేహం అక్కరలేదు. 

భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది:

" గిరా గద్గదయాస్తౌషీత్సత్త్వ

  మాలంబ్య సాత్వతః . 

  ప్రణమ్య మూర్ధ్నావహితః 

  కృతాంజలిపుటః శనైః "

              - భాగవతం 10:39:57

" గొంతు గద్గదమయి, కళ్ళంపట నీరు కారుతూండగా చేతులు పైకి ఎత్తి తలవంచి స్వామికి నమస్కరించారు " అని. ఎవరు, ఎందుకు, ఎప్పుడో చూద్దాం.

కృష్ణబలరాములని చంపించడానికి కంసుని ప్రయత్నంలో భాగంగా అక్రూరుడు వారిని బృందావనం నుంచి మధురకు తీసుకుని వెడుతూ ఉంటారు. సూర్యాస్తమయం అవుతూండడంతో యమునానది ఒడ్డున రథం ఆపి దిగుతారు అక్రూరుడు సంధ్యావందనంకి. నదిలో దిగుతూంటే నీటిలో కృష్ణబలరాములు కనిపిస్తారు. వారికి ఉపనయనం అవలేదు, ఇక్కడకు ఎందుకు వస్తారు, రథంలోనే ఉన్నారు కదా అని వెనక్కి తిరిగి చూస్తే వారు రధంలోనే ఉన్నారు. సరే అనుకుని ఓ మునక వేయగానే ఆయనకు నీటిలో తెల్లటి వేయిపడగల ఆదిశేషుని మీద పడుకున్న పీతాంబరధారి విష్ణువు, వారిని సేవిస్తూన్న నారదుడు, ఇంద్రాదిదేవతలు, లక్ష్మీదేవి, శక్తి దేవతలు దర్శనమిస్తారు. అక్రూరుడికి విష్ణువు అనుగ్రహించిన విశ్వరూపం.

అక్రూరుడు కృష్ణుడి అనుగ్రహానికి చలించిపోయి కన్నీరు కారుతూ ఉండగా చేతులు పైకి ఎత్తి తలవంచి అంజలి ఘటిస్తారు.

" అక్రూరవరద గోవిందో హరి " అని ప్రార్థిస్తారు అందుకే కృష్ణుడిని. 

అనన్యభక్తులను అలా అనుగ్రహిస్తారు అమ్మవారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ