అమ్మవారికి భక్తులంటే ఎంత ప్రేమో, భక్తికి వశమయిపోతారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" భక్తివశ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 120 వ నామం.
" భక్తివశ్యా " అంటే భక్తికి అధీనురాలు.
తిన్నడు చదువుకోలేదు. ఏది చేయవచ్చో ఏది చేయకూడదో తెలియదు. నోటితో నీరు తీసుకువచ్చి లింగంమీద పోసాడు. మాంసం నైవేద్యం పెట్టాడు. కాని శివుడి కన్నులోంచి నీరు కారుతూందని తన కన్ను తీసి పెట్టేసాడు. సమర్పణ. తన్ను తాను సమర్పించేసుకోవడం. అటువంటి భక్తులకు వశమయిపోతారు దేవతలు.
భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది:
" అథావరూఢః సపదీశయో రథాత్
ప్రధానపుంసోశ్చరణం స్వలబ్ధయే,
ధియా ధృతం యోగిభిరప్యహం
ధ్రువం వ నమస్య ఆభ్యాం చ
సఖీన్ వనౌకసః "
" రథం దిగగానే పరుగున వెళ్ళి కృష్ణుని పాదాలపై పడిపోతాను. ఆయన దయామయుడు. ఆయన చేయి నా తలపై పెట్టి క్షమిస్తాడు " అనుకుంటాడు అక్రూరుడు.
అక్రూరుడు కృష్ణభక్తుడు. యదువంశీయుడు, శాంతస్వభావి, దయార్ద్రహృదయుడు. కంసుని స్నేహితుడు.
కంసుడు అక్రూరుడిని పిలిచి " బృందావనం వెళ్ళు. కృష్ణబలరాములని యాగానికి ఆహ్వానించు. ఊరికే రమ్మంటే రారు కనుక చతుర్ధశి నాడు ధనుర్యాగం చేస్తాను నేను అని ఆహ్వానించు. వారివల్ల నాకు మరణభయం ఉంది. మొదటి ద్వారం వద్ద కువలయాపీడనం అనే ఏనుగును ఉంచుతాను. అది వారిని చంపేస్తుంది. అది కుదరకపోతే తరువాత మన మల్లయుద్ధవీరులు ఉంటారు రెండో ద్వారం వద్ద వారిని చంపడానికి " అని.
అక్రూరుడు అనుకుంటాడు " చంపించడానికని కృష్ణబలరాములను తీసుకురమ్మని నన్ను పంపిస్తున్నాడు కంసుడు. ఎంత పాపపు పని చేస్తున్నాను. నా మనస్సు కృష్ణునికి తెలియదా. రధం ఆగగానే పరుగున వెళ్ళి కృష్ణుని పాదాలపై పడిపోతాను. అన్ని విషయాలూ చెప్పేస్తాను. ఆయన తన చేతిని నా శిరస్సుపై ఉంచి ఆశీర్వదిస్తారు " అని.
ఆశ్చర్యం ఏమిటంటే ఈయన రధం దిగి వెళ్ళి కృష్ణుని పాదాలపై పడబోతూండగానే కృష్ణుడు ఈయన్ని పైకి లేపి గాఢంగా కౌగిలించుకుంటారు, ఏమీ చెప్పకుండానే. అనన్యభక్తులంటే అంత ప్రేమ.
భక్తులంటే అంత కరుణ, ప్రేమ అమ్మవారికి. భక్తవశ్యురాలు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment