అమ్మవారు సంతోష ప్రదాత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" తుష్టిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 443 వ నామం . 

" తుష్టిః " అంటే సంతోషస్వరూపురాలు.

" యా దేవీ సర్వభూతేషు 

  తుష్టి రూపేణ సంస్థితా "

అమ్మవారు జీవులలో సంతోషరూపంలో ఉంటారు. 

రుద్రచమకం పారాయణ చేస్తూ " సూషా చ మే, సుదినం చ మే " అని ప్రార్థిస్తాం. ఈరోజు మంచి రోజుగా చేయమని ప్రార్ధన. ఎవరయినా ప్రతీ రోజూ సంతోషంగా గడిచిపోవాలనే కోరుకుంటారు. ఎవరితోనో కావాలని గొడవపెట్టుకోవాలని కోరుకోరు.

సమాజం మాయ చేస్తుంది. మనల్ని మనంగా ఉండనివ్వదు. అవసరంలేని విషయాలలో కలుగచేసుకుని ఇరుక్కుంటాం.

" అతి సర్వత్ర వర్జయేత్ " అన్నారు. మంచితనం కూడా అతి పనికిరాదు. మంచితనం కారణంగా కూడా కొందరు కష్టాలపాలవుతూంటారు. లేదు, కాదు అనలేకపోవడం కొందరికి బలహీనత. శక్తికి మించిన సహాయాలు చేస్తూ కూడా కొందరు కష్టాలపాలవుతూంటారు.

ధర్మరాజు భీష్ముని " మనిషి పాటించవలసిన అత్యుత్తమ ధర్మం ఏమిటి తాతా " అని అడుగుతాడు. భీష్ముడు అంటారు " ఎదుటివారు ఏ పని చేస్తే నీకు అసౌకర్యం, బాధ కలుగుతాయో ఆ పని నీవు చేయకుండా ఉండడమే అత్యుత్తమ ధర్మం " అని. ఎంత అద్భుతం మన వాజ్మయం.

ఏదయినా పని మొదలు పెట్టేటప్పుడు అది తనకు అవసరమా, తన శక్తికి సరిపోయేదేనా అని ఆలోచన చేయాలి. అలా చేయగలిగితే కష్టాలపాలవకుండా సంతోషంగా గడపవచ్చు. అందరూ అలా ఆలోచిస్తే సమాజం సంతోషంగా ఉంటుంది.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అటువంటి బుద్ధిని ప్రసాదించి సంతోషాన్ని కలుగచేస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ