అమ్మవారి చిరునవ్వు కొందరికి అసూయ, బాధ, కోరిక కలిగిస్తుందిట - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" దరస్మేరముఖాంబుజా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 924 వ నామం.
" దరస్మేరముఖాంబుజా " అంటే చిరునవ్వు గల ముఖము గలది. అమ్మవారు ఎప్పుడూ చక్కటి చిరునవ్వుతో ఉంటారు. అమ్మవారికి విచారపడే విషయమేముంటుంది. భక్తులను యోగులను చూసి మురిసిపోతూ ఉంటారు. చెడుదారులు పట్టి బాధలలో ఉన్నవారిని చూసినా అమ్మవారికి బాధ ఉండదు. ఎందుకంటే ఎలాగయినా వారిని సన్మార్గంలో పెట్టగలననే ధీమా అమ్మవారిది. అందుకని ఎల్లప్పుడూ చిరునవ్వుతోనే ఉంటారు.
దేవతలందరూ ఏవేవో కోరికలతో వస్తారుట అమ్మవారి దగ్గరకు. అమ్మవారి చిరునవ్వు చూడగానే ఎందుకొచ్చామో మర్చిపోతారుట. అమ్మవారు " చెప్పండి నాయనా, ఏమి కావాలి " అంటే ఏమీ లేదమ్మా, మీ పాద దర్శనం కోసం వచ్చామని చెప్పి నమస్కరించి వెళ్ళిపోతారుట.
మూక శంకరులు కామాక్షీదేవి అమ్మవారి చిరునవ్వు మీద నూరు శ్లోకాలు వ్రాసారు. అది మందస్మిత శతకంగా ప్రసిద్ధి చెందింది.
అందులో ఓ శ్లోకంలో అతిశయోక్తి అలంకారం వాడారు:
" మందారే తవ మంథరస్మితరుచాం
మాత్సర్యమాలోక్యతే కామాక్షి
స్మరశాసనే చ నియతం
రాగోదయో లక్ష్యతే,
చాంద్రీషు ద్యుతిమంజరీషు చ
మహాద్వేషాంకురో దృశ్యతే శుద్ధానాం
కథమీదృశీ గిరిసుతే2తి
శుద్ధా దశా కథ్యతామ్ " - 44
మందారం పువ్వులు అంటే తెల్లజిల్లేడు పువ్వులు. తెల్లగా ఉంటాయి. వాటికి అమ్మవారి చిరునవ్వు చూసి అసూయగా ఉందిట. అమ్మవారి చిరునవ్వు శివుడికి రాగం అంటే కోరిక కలుగచేస్తూందిట. చంద్రకాంతులు అంటే వెన్నెలకు బాధగా ఉందిట అమ్మవారి చిరునవ్వులా లేనే అని.
మూకశంకరులు అడుగుతూన్నది " నీ చిరునవ్వు అసూయ, కోరిక, బాధ కలిగించడమేమిటమ్మా " అని. అతిశయోక్త్యంలంకారం ఇది. కవుల భావాలు అలా అద్భుతంగా ఉంటాయి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment