ఎదుటివారి భావాలను అర్ధంచేసుకుంటూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" భావజ్ఞా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 841 వ నామం.

" భావజ్ఞా " అంటే భావములను తెలిసినది లేక ఎరుగునది.

శంకరులు శివానందలహరి చేస్తూ " నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా......" (10) - ఏ జన్మ అయితేనేమి, మనస్సును మాత్రం నీపాదాలపైనే ఉండేలా చూడు తండ్రీ అంటారు. 

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మన మనస్సులోని భావాలకు అనుగుణంగా అన్నీ అనుగ్రహిస్తారు. ప్రత్యేకంగా ఏమీ కోరుకోనక్కరలేదు.

కుచేలుడి భార్య " ముఖ్యంగా పిల్లలకు జీవితం గడవడమే కష్టంగా ఉంది. వెళ్ళి మీ స్నేహితులు కృష్ణుడిని ఒకసారి కలవవచ్చుగదా " అంటుంది. వెళ్ళి ధనమో మణులో అడిగి తీసుకునిరండి అనలేదు ఆమె. కాని ఆమె మనస్సులోని భావాన్ని గ్రహించాడు కుచేలుడు. సరే అని బయలుదేరి వెళ్ళాడు. కాని అతని మనస్సులో ధనం కోరుదామనే ఆలోచనే లేదు. చాలాకాలమయింది కృష్ణుడి దర్శనం చేసుకుని తరిద్దాం అని వెళ్ళాడు.

భార్య మనస్సులోని భావాన్ని కుచేలుడే తెలుసుకోగలిగినప్పుడు కుచేలుడి మనస్సులోని భావాన్ని పరమాత్మ తెలుసుకోలేడా. అందుకే కుచేలుడు వెళ్ళేటప్పటికే కృష్ణుడు తయారుగా ఉన్నారు. పరుగున వచ్చి గాఢాలింగనం చేసుకున్నారు. హంసతూలికాతల్పంపై కూర్చుండబెట్టి కాళ్ళు కడిగారు. పిడికెడు అటుకులు తిని సమస్త సంపదలను అనుగ్రహించారు. ప్రక్కన కూర్చుని రాత్రంతా కబుర్లు చెప్పి ఆనందం కలిగించారు.

" ఇంతకూ తను వచ్చిన పని అయిందా, నేను ఏమీ అడుగలేదు, కృష్ణుడు ఏమీ ఇవ్వలేదు. అయినా నా అంత ఆనందించినవాడు, లాభపడ్డవాడు ఇంకెవరు ఉంటారు " అని సంతోషించాడు కుచేలుడు. కృష్ణుడు అనుగ్రహించిన సంపదల గురించి కుచేలుడికి ఏమీ తెలియదు.

భక్తులు అడగాలా. భక్తులకు ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో అమ్మవారికి తెలియదా. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ