రాక్షసి పూతనను దహనం చేస్తూంటే సువాసనలు కలిగాయిట - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" పావనాకృతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 619 వ నామం .

" పావనాకృతిః " అంటే పవిత్రీకరింపచేయు ఆకారము గలది. యాజ్ఞవల్క్య స్మృతి తపస్సు, వేదాధ్యయనం స్థూలశరీరాన్ని శుద్ధి చేస్తుంది, జ్ఞానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. జీవుని ఈశ్వరుడుగా తెలుసుకుంటే అన్నిటికంటే ఉత్తమమగు శుద్ధి కలుగుతుంది అని తెలియచేస్తూంది.

పూతన రాక్షసి. బాలకృష్ణుడిని చంపడానికి వచ్చి ఆయనచేతిలో మరణించింది. భారీకాయం. ఎందరినో మనుషులను, జంతువులను తిని ఉంటుంది. శరీరమంతా విషం పేరుకుపోయి ఉంటుంది. ఎలా వదుల్చుకోవాలి. నందుడు ఆ శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికించి ఊరుకు దూరంగా దహనానికి ఏర్పాటు చేసాడు. 

ఆశ్చర్యకరంగా దహనమవుతూన్న పూతన శరీరంనుంచి మంచిగంధం, సుగంధద్రవ్యాలు కాలుస్తూన్నట్లు చక్కటి సువాసన వస్తూంది. 

భాగవతం వింటూన్న పరీక్షిత్తు ఆశ్చర్యపోయి " అదెలా సాధ్యం మహర్షీ, పూతన మహా పాపాత్మురాలు, రాక్షసి, శరీరం దహనం అవుతూంటే పుణ్యాత్ములకు లాగ చక్కటి సువాసనలు ఎలా వచ్చాయి " అని అడుగుతాడు శుకమహర్షిని. 

" పూతన కృష్ణుడిని ఒడిలో కూర్చోపెట్టుకుంది. కృష్ణుడు చేతితో పూతనను తాకాడు. తాకగానే పూతన జన్మజన్మల పాపం పూర్తిగా నశించింది. పూతన శరీరం పరమపవిత్రమయి పోయింది. దహనమవుతూంటే అటువంటి సువాసనలు రావడంలో ఆశ్చర్యం ఏముంది " అంటారు శుకమహర్షి.

మనస్సునే పావనం చేయగలిగే అమ్మవారికి దేహాన్ని పావనం చేయడం ఎంత పని.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ