అమ్మవారు జననమరణములు లేని శాశ్వతురాలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" నిర్నాశా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 180 వ నామం .
" నిర్నాశా " అంటే నాశనము లేనిది. అమ్మవారు శాశ్వతురాలు. పుట్టడం లేక తయారుచేయబడటం ఉంటే మరణం/నాశనం ఉంటుంది. అమ్మవారు అజ అంటే పుట్టుక లేనిది.
జీవుడికి జన్మనిచ్చేది తండ్రి, తండ్రికి తాత, తాతకు ముత్తాత. అలా వెనక్కు వెడితే మన గోత్ర ఋషి తెలుస్తారు. ఆ ఋషికి కూడా ఒకరు జన్మనిచ్చి ఉండాలిగా. అలా మళ్ళీ వెనక్కు వెడితే చివరకు తెలిసేది అమ్మవారు. అమ్మవారు స్వయంభూ. పుట్టుక లేదు. పుట్టుక ఉంటే మళ్ళీ తల్లిదండ్రులు ఉంటారు కదా. అంటే మళ్ళీ వెనక్కు తెలుసుకుంటూ వెళ్ళాలి. పుట్టుక నాశనము లేని శాశ్వతురాలు అమ్మవారు.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" నాహం ప్రకాశః సర్వస్య
యోగమాయాసమావృతః,
మూఢో2యం నాభిజానాతి
లోకో మామజమవ్యయం "
- భ.గీత 7:25
" నా యోగమాయయందు నేను అందరికిని గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలిసికొనలేరు ". అంటే " నన్ను జనన మరణములకు లోనగువానినిగా తలంతురు " అన్నారు పరమాత్మ .
" యతో వా ఇమాని భూతాని
జాయంతే యేన జాతాని జీవంతి,
యత్ప్రయంతి అభిసంవిశంతి,
తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి "
- తైత్తిరీయోపనిషత్తు
" దేని నుంచి ఈ భూతకోటి పుడుతున్నదో, దేనివలన పుట్టిన భూతకోటి జీవిస్తున్నదో అంత్యమున దేనిలో లీనమవుతున్నదో దానిని తెలుసుకొనుటకు ప్రయత్నించు. అది జననమరణములు లేని బ్రహ్మ అని " అని తెలియచేస్తూంది ఈ ఉపనిషత్తు.
అమ్మవారు జననమరణములు లేని శాశ్వతురాలు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment