అమ్మవారు జ్ఞానులచే పూజింపబడుతారు - జ్ఞాని ఎవరు?- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" బుధార్చితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 825 వ నామం. 

" బుధార్చితా " అంటే జ్ఞానులచే పూజింపబడునది అని భాష్యం చెప్పారు.

జ్ఞాని అంటే ఎవరు?.

కఠోపనిషత్తు ఇలా తెలియచేస్తూంది:

" ఆత్మానం రథినం విద్ధి, 

  శరీరం రథమేవ తు బుద్ధిం 

  తు సారథిం విద్ధి మనః 

  ప్రగ్రహమేవ చఇన్ద్రియాణి 

  హయానాహుర్విష

  యాంస్తేషు గోచరాన్   

  ఆత్మేన్ద్రియమనో యుక్తమ్    

  భోక్తేత్యాహుర్మనీశిణః "

                -1:3:3,4

" ఆత్మ రథికుడని తెలుసుకో.  శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఆ గుర్రాలు విషయాల వైపుకు పరుగులు తీస్తాయి.  ఇటువంటి శరీరేంద్రియ మనస్సులతో కూడిన జీవుడు భోక్త అని పెద్దలు అంటారు " అని.

గుర్రానికి తిన్నగా వెళ్ళడం కోసం కళ్ళకు ప్రక్కన గంతలు కడతారు. అప్పుడు అది ప్రక్కలకు చూడలేదు.

శరీరస్థుడైన ఆత్మ మనోబుద్దుల ( గంతల) ద్వారా ఇంద్రియాలను నియంత్రించి, అవి విషయాల వైపుకు వెళ్ళకుండా చూచుకుంటేనే గమ్యం చేరతామని - అంటే ఆ విధంగా జాగ్రత్త పడినప్పుడే ఇంద్రియాలను అంతర్ముఖం చేసి ఆత్మవైపుకు మరలించడం సాధ్యం అని ఈ ఉపనిషత్తు చెబుతోంది. అంతర్ముఖం దేనికి?

" అంగుష్ఠమాత్రః పురుషో 

  మధ్య ఆత్మని తిష్ఠతి " 

      - కఠోపనిషత్తు 2:1:12

మన హృదయంలోనే బ్రొటకనవ్రేలు పరిమాణంలో అమ్మవారు ఉంటారు అని తెలియచేస్తూంది కఠోపనిషత్తు. అమ్మవారిని తెలుసుకోవాలంటే లోపలికి ప్రయాణం చేయాలి.

లోపలికి ప్రయాణించాలంటే బయట విషయాల మీద ఆసక్తిని తగ్గించాలి. దానికని ఇంద్రియములకు ( మానసిక ) గంతలు కట్టుకోవాలి.

ఇలా చేసేవారిని జ్ఞానులు అంటారు. వారికి అమ్మవారి స్మరణ, పూజ తప్ప వేరే ధ్యాస ఉండదు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ