శ్రీపురందరదాస ఆరాధనోత్సవం నేడు, ఆయనకు నివాళులు అర్పించుకుందాం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" పార్ధ నైవేహ నాముత్ర
వినాశస్తస్య విద్యతే,
నహి కళ్యాణకృత్ కశ్చిత్
దుర్గతిం తాత గచ్ఛతి "
- భ.గీత 6:40
పరమాత్మ అంటారు " మంచి చేసేవారికి ఎప్పుడూ విచారం/దుఃఖం ఉండదు " అని.
ఒకవేళ ఈజన్మలో ఆ ఫలితం కనబడకపోయినా మరుజన్మలలోనైనా వారు ఫలితాన్ని/మంచిని పొంది తీరుతారని కూడా సెలవిచ్చారు.
పురందరదాసు, వేమన, వాల్మీకి, పుండరీకుడు ఆ కోవలోకి వస్తారని అనుకోవచ్చు.
పురందరదాసగారి గురించిన కొన్ని అద్భుత విషయాలు నెమరువేసుకుందాం.
పురందరదాసు ఒక వజ్రాలవ్యాపారి కొడుకు. లోభి. పిల్లికి కూడా బిచ్చం వేసేవాడుకాడు. 20 ఏట తల్లితండ్రులు పోవడంతో వ్యాపారం చూసుకోవడం మొదలు పెట్టాడు. విపరీతంగా సంపాదించాడు. ఆరోజుల్లోనే ఆయన్ని " నవకోటిపతి " అని పిలిచేవారు. అంతటి జమీందారు.
ఓరోజు ఓ పేదబ్రాహ్మడు వచ్చి " నాకొడుకు ఉపనయనం, ఏమయినా సహాయం చెయ్యండి " అని బ్రతిమిలాడినా వ్యంగ్యంగా దూషించి పొమ్మని బయటకు వెళ్ళిపోతాడు. బ్రాహ్మడు వ్యాపారి భార్యను బ్రతిమిలాడుతాడు. ఆవిడ జాలిపడి తన ముక్కుపుడకను ఇస్తుంది. ఇతను ఆ ముక్కుపుడకను అమ్మడానికి ఆ వ్యాపారి కొట్టుకే వెడతాడు. వ్యాపారి ముక్కుపుడకను గుర్తుపట్టి, బ్రాహ్మణుడిని తన కూడా రమ్మని ఇంటికి వచ్చి భార్యతో " నీ ముక్కుపుడకను తీసుకురా " అనడంతో ఆమె విషయం తనభర్తకు తెలిసిపోయినట్లుంది, బ్రతకడం వృధా అని అనుకుని విషం త్రాగడానికి గిన్నె ఏర్పాటుచేసుకుని భగవంతుడికి ప్రార్ధనలు చేసి వచ్చి గిన్నె తీసుకుని త్రాగపోతే దానిలో ముక్కుపుడక కనబడుతుంది. దానిని తీసుకెళ్ళి భర్తకు ఇస్తే అతనికి మతిపోతుంది. పేదబ్రాహ్మణుడి గురించి చూస్తే లేడు, వెదుకుతే దొరకలేదు.
ఏమిటీ జీవితం అనుకున్న ఆ వ్యాపారి " శ్రీనివాస నాయక " తన 30వ ఏట వైరాగ్యం చెంది, యావదాస్తిని దానం చేసేసి " పురందరదాస " గా మారి జీవితాంతం దేవుని " పాండురంగ విఠలుని " ధ్యాసలోనే గడిపాడు.
475000 కీర్తనలు చేసారు/వ్రాసారు. సంగీతం నేర్చుకునేవారికి ప్రారంభంలో అనుకూలంగా ఉండడం కోసం " మాయామాళవగౌళ " రాగాన్ని అందించారు. పిల్లలు పాడుకోవడానికి " పిళ్ళారి గీతాలు " ఇచ్చారు. భాగవతంలోని కష్టమయిన శ్లోకాలన్నిటిని తేలికపదాలతో అందరూ పాడుకునేలా కీర్తనలుగా ఇచ్చారు. ఈయనను త్యాగయ్య తన " గేయనాటకం, ప్రహ్లాద భక్తి విజయం " లలో కొనియాడారు, " మహాపురుషులు " అని నివాళులు అర్పించారు.
పురందరదాస 5 లక్షల కీర్తనలు చేయాలనుకున్నారుట. 475000 చేసారు. పరమపదించేముందు చిన్నకొడుకు " మధ్వపతి " ని పిలిచి మిగిలిన 25 వేల కీర్తనలను నువ్వు ఎలాగయినా పూర్తిచేయాలి అంటే కొడుకు " మళ్ళీ నేనెందుకు, నువ్వే నీ మళ్ళీ జన్మలో పూర్తి చేద్దువుగానిలే " అని చెప్పాడుట.
కొంతకాలానికి " విజయదాస " అనే ఆయన కీర్తనలు చేయడం, అవి పురందరదాసు కీర్తనలలాగానే ఉండడంతో పురందరదాసుగారే విజయదాసగా మళ్ళీ జన్మించారు అని ప్రజలు అనుకునేవారుట. ఆశ్చర్యంగా విజయదాస 25 వేల కీర్తనలే చేసారు. 5 లక్షల కీర్తనల లెక్క సరిపోయింది.
అందరూ ఆయన్ని " నారదుని " అవతారంగా భావించి గౌరవించేవారు.
విజయనగరసామ్రాజ్యం అంతా కీర్తనలు పాడుతూ పర్యటించారు. వింత ఏమిటంటే ఈయన తన 80వ ఏట మరణించిన కొద్దిరోజులకే విజయనగరసామ్రాజ్యం పతనమయింది.
మహాపురుషులు. అటువంటివారిని ఒకసారి తలచుకున్నా " నాదరూపిణి " అయిన అమ్మవారు ఆనందించి అనుగ్రహిస్తుంది.
ఈరోజు శ్రీపురందరదాస ఆరాధనోత్సవం. ఆయనకు నివాళులు అర్పించుకుందాం.
ఈరోజు పరమపవిత్రమయిన చొల్లంగి/మౌని అమావాస్య. శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీపాండురంగవిఠలార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment