శరీరాన్ని అశ్రద్ధ చేయమని చెప్పలేదు శాస్త్రాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మహావిద్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 584 వ నామం.

" మహావిద్యా " అంటే సమస్త అనర్ధనివారకమైన గొప్పజ్ఞానస్వరూపురాలు అని అర్ధం చెప్పారు. అన్ని విద్యలలోను ( జ్ఞానములలోను ) ఆత్మజ్ఞానమే ఉత్కృష్టమైనది కావున అది మహావిద్య అయినది. ఈ జ్ఞానము పొందినవాడు అన్ని అనర్ధములు నశించిపోయి ఆనందరూపుడగును అని భాస్కరరాయలు భాష్యం చెప్పారు.

కేనోపనిషత్తు ఈ ఆత్మజ్ఞానం గురించి విస్తారంగా ప్రస్తుతించింది:

" ఆప్యాయంతు మమాంగాని " నా జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఆరోగ్యంగా ఉంచమని పరమాత్మను ప్రార్ధించడంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది.

మానవులలోనే గాక స్థావర జంగమాలన్నింటి లోనూ ఆత్మ ( అమ్మవారి చైతన్యం ) ఉన్నదని వేదాంతం చెప్తూంది.  అలాంటప్పుడు మోక్షం మానవునికి ఒక్కనికే ఎలా సాధ్యం? అనే ప్రశ్నకు ఈ ఉపనిషత్తు ఇలా తెలియచేసింది:

" మానవునిలో మాత్రమే మనో బుద్ధ్యహంకారాలు ఉన్నాయి.  వాటి ద్వారానే మోక్షం సాధ్యం " అంది.  అవి ప్రకాశించాలంటే ఆరోగ్యమైన, దృఢమైన శరీరం అవసరం. అందుకని ఇంద్రియములను ఆరోగ్యంగా ఉంచమని ప్రార్ధన చేయాలి.  వేదాంతం ( ఉపనిషత్తు ) శరీరాన్ని ఉపేక్ష చేయమని చెప్పదు; శరీరమే సర్వస్వమూ అని అనుకోకూడదని తెలియచేస్తుంది.

రాసలీలకు ముందు కృష్ణుడు గోపికలతో " భర్తలను పిల్లలను బంధువులను వదిలి అర్ధరాత్రి ఇలా వచ్చేసారు. అందరూ ఏమనుకుంటారు " అని పరీక్ష చేస్తారు. గోపికలు అంటారు:

" మైవం విభోయర్హతి భవన్ 

  గదితుం నృశంసం   

  సంత్యజ్య సర్వమతవశ్యం,   

  భక్తా భజస్వ దురవగ్రహ  

  మా త్యజాస్మాన్

  దేవో యథాదిపురుషో 

  భజతే ముముక్ష్యం "

      - భాగవతం 10:29:31

" ఓ సర్వశక్తిమంతుడా, నీవు ఇలా క్రూరమైన రీతిలో మాట్లాడకూడదు. నీ పాదపద్మములకు భక్తి పూర్వకమైన సేవ చేయుటకు సమస్త భౌతిక ఆనందములను త్యజించిన మమ్ములను తిరస్కరించకుము. ఓ మొండివాడా, ఆదిదేవుడైన శ్రీనారాయణుడు ముక్తిని కోరే భక్తులను అనుగ్రహించినట్లే మమ్ము అనుగ్రహించు " అని.

ముక్తి లభించే సమయం ఆసన్నమైనప్పుడే ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే సమయం వచ్చినప్పుడు అమ్మవారే అనుగ్రహిస్తారు.

ఈరోజు నుంచి శ్రీశ్యామలాదేవీ నవరాత్రులు ప్రారంభం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ