" శాంతము లేక సౌఖ్యము లేదు " అన్నారు త్యాగయ్య - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శాంతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 447 వ నామం .
" శాంతిః " అంటే కామక్రోధములు లేకుండుట అని భాష్యం చెప్పారు.
" యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా " - అమ్మవారు జీవులందరిలోనూ శాంతి రూపంలో ఉంటారు.
ఏ మనిషి అయినా ప్రశాంతంగా జీవించాలనే కోరుకుంటాడు. ఉదయాన్నే ఈరోజు ఏ గొడవలు లేకుండా హాయిగా గడిచేలా చేయమని అమ్మవారిని ప్రార్థిస్తాడు కూడా. కాని సమాజం అలా జరగనీయదు, పరీక్షలు పెడుతుంది. మనకు తెలీకుండానే కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి.
అధర్వణవేదంలో శాంతి సూక్తం ఉంది. అందులో ఓ అద్భుత శ్లోకం ఉంది:
" ఇయం యా పరమేష్ఠినీ
వాగ్దేవీ బ్రహ్మసంశితా,
యయైవ ససృజే ఘోరం
తయైవ శాంతిరస్తు నః "
" బ్రహ్మ నుండి మహిమను పొంది, ఎవరి వలన ఘోర పరిమాణాలు ఏర్పడుతున్నాయో ఆ దేవీ, సర్వోత్కృష్ట దైవమూ అయిన సరస్వతీదేవి మనకు శాంతిని ప్రసాదించుగాక " అని.
ఇది చదివితే ఆశ్చర్యం వేస్తుంది. సరస్వతీదేవివల్ల ఘోరపరిమాణాలు కలగడం ఏమిటి అని. సరస్వతీదేవి వాక్కుకు అధిపతి. అనవసరమయిన తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల ఘోర పరిమాణాలు సంభవించడం మనం చూస్తూనే ఉంటాం. మన మాటను అదుపులో ఉంచమని సరస్వతీదేవిని ప్రార్ధన చేస్తూ ఉండాలి అని తెలియచేస్తూంది ఈ సూక్తం.
" నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది " అని సామెత. నోరును అదుపులో ఉంచుకోవడం వల్ల శాంతి కలుగుతుంది.
" శాంతము లేక సౌఖ్యము లేదు " అన్నారు త్యాగయ్య.
" అశాంతస్య కుతః సుఖం - భ.గీత 2:66 - ఎప్పుడూ అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడిది " అన్నారు పరమాత్మ గీతలో. జీవితం ప్రశాంతంగా ఆనందంగా గడవాలంటే శాంతి ముఖ్యం.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరికీ శాంతిని ప్రసాదించి ప్రశాంతంగా జీవించేలా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment