కనిపించేదంతా మాయ, నాశనమయేదే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మూలప్రకృతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 397 వ నామం.
" మూలప్రకృతిః " అంటే పరమాత్మ స్వరూపురాలు. ఇద్దరూ ఒకరే. అర్ధనారీశ్వరం.
ఆదిశంకరులు " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య " అన్నారు. ఈ జగత్తు/ప్రకృతి అంతా మిథ్య/మాయ అన్నారు. మరి మళ్ళీ ఈ మూలప్రకృతి ఏమిటి?.
మానవులలోనే గాక స్థావర జంగమాలన్నింటి లోనూ ఆత్మ ( అమ్మవారి చైతన్యం ) ఉన్నదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ప్రకృతి అంటే మనకు కనిపించేది అంతా. ఇది మాయ అంటే నశించేది అని తెలుస్తూనే ఉంది. పుట్టుక ఉంటేనే నాశనం ఉంటుంది. అంటే ఈ ప్రకృతి పుట్టుకకు కారణం వేరే ఏదో ఉంది. దానినే మూలప్రకృతి అన్నారు. మూలప్రకృతి నుంచే మనం చూసే ప్రకృతి అంతా పుడుతూంది అని తెలుసుకోవాలి.
" యతో వా ఇమాని భూతాని
జాయంతే యేన జాతాని జీవంతి,
యత్ప్రయంతి అభిసంవిశంతి,
తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి "
- తైత్తిరీయోపనిషత్తు
" దేని నుంచి ఈ భూతకోటి పుడుతున్నదో, దేనివలన పుట్టిన భూతకోటి జీవిస్తున్నదో అంత్యమున దేనిలో లీనమవుతున్నదో దానిని తెలుసుకొనుటకు ప్రయత్నించు. అది జననమరణములు లేని బ్రహ్మ అని గ్రహించు " అని తెలియచేస్తూంది ఈ ఉపనిషత్తు.
ఆ బ్రహ్మమే మూలప్రకృతి.
ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" సర్వయోనిషు కౌంతేయ
మూర్తయః సంభవంతి
యాః, తాసాం బ్రహ్మ
మహద్యోనిః అహం బీజప్రదః పితా "
- భ.గీత 14:4
" నానాయోనులయందు జన్మించు ప్రాణులను తనగర్భమున ధరించు మూలప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి " అన్నారు పరమాత్మ. ఆ మూలప్రకృతియే అమ్మవారు. అమ్మవారి నుంచే సృష్టి అంతా జరుగుతూంది, అమ్మవారిలోనే లయం అవుతూంది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment