భక్త రామదాసు జయంతి నేడు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" భండనభీముఁ డార్తజనబాంధవుఁ
డుజ్జ్వలబాణతూణ కోదండకలా ప్రచండ
భుజతాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్ గడగట్టి భేరికా
డాండ డడాండడాండ నినదంబు లజాండము
నిండ మత్తవే దండము నెక్కిచాటెదను
దాశరథీ! కరుణాపయోనిధీ "
ఈ పద్యం భక్తరామదాసు గా ప్రసిధ్ధి చెందిన కంచర్ల గోపన్న వ్రాసిన " దాశరధీ శతకం " లోనిది.
" యుద్ధం చెయ్యడం లో ప్రసిద్ధి గాంచిన వాడు, భక్తజన బాంధవుడు, కోదండంతో ఉజ్వల బాణాలు వేయగల భుజ బలసంపదగల రాముడిని మించిన వేరే దేవుడు లేడని ఢం ఢం ఢం ఢం ఆని ఢంకా భజాయించి భూమండలమంతా వినబడేలా మదించిన ఏనుగు మీదకెక్కి చాటుతాను " అని అర్ధం.
ఖరదూషణాదులతో సహా 14000 మంది రాక్షసులను 3 ఘడియలలో అంటే 72 ని.ల లో చంపేసాడు రాముడు. వీరందరూ మరణించాక ఒక్కడు మాత్రం పారిపోయి రావణుడిని కలిసి " నువ్వు జనస్థానంలో ఉంచిన వారందరూ చంపబడ్డారు " అని చెబుతాడు. అతను అనుకంపనుడు.
రావణుడు ఆశ్చర్యపోయి " ఎలా చనిపోయారు, ఎంతమంది వచ్చారు చంపడానికి " అని అడుగుతాడు.
అనుకంపనుడు " ఒకే ఒక్కడు, అందమైన కళ్ళు, మనోహరమైన రూపం. అతను తలుచుకుంటే ఒక్కబాణంతో సముద్రాన్ని ఇంకింపచేయగలడు, వాయువుని స్తంభింపచేయగలడు, గ్రహాల గతి తప్పించగలడు, విశ్వాన్నంతా నాశనం చేయగలడు, తిరిగి సృష్టించగలడు " అని చెబుతాడు.
ఇంతకీ అనుకంపనుడు రాముడిని చూసినది 72 ని.ల సమయం. అతి తక్కువ సమయంలో రాముడు " సృష్టి స్థితి లయ కారకుడు అనగా బ్రహ్మ విష్ణు శివ స్వరూపుడు " అని గ్రహించగలిగాడు అని తెలుసుకోవాలి. అదే రామదాసు చెప్పినది.
" ధర్మసంస్థాపనార్ధాయ
సంభవామి యుగే యుగే ( భ.గీత 4:8 )" అన్నారు పరమాత్మ. ధర్మానికి హాని జరుగుతూన్నప్పుడు అస్తమానూ ఆయన రారు, ఎవరో ఒకరిని పంపిస్తారు.
మతోన్మాదులు దేశాన్ని ఏలుతూ దేవాలయాలను కూల్చివేస్తూ హిందువులను హింసిస్తూ యధేచ్ఛగా మతమార్పిడులు చేస్తూన్న సమయంలో నవాబుల పాలనలో ఉన్న భద్రాచలంలో రామదాసు శ్రీరాముడికి అద్భుతమైన గుడి కట్టడమే కాకుండా రాముడి పరాక్రమాన్ని ధర్మనిరతను స్తుతిస్తూ ఎన్నో అద్భుత కీర్తనలను, దాశరధిశతకాన్ని మనకు ప్రసాదించి, సనాతనధర్మ పరిరక్షణకు పాటుపడ్డారు. మరి రామదాసు కారణజన్ముడు కాక మరేమిటి. అటువంటి వారిని తలచుకున్నా జన్మ ధన్యం అవుతుంది.
ఈ రోజు " శ్రీరామదాసు జయంతి ". ఆయన్ని తలచుకుని కీర్తించుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment