నాకు ఏమీ తెలియదు అన్నవారు జ్ఞాని - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" అవ్యక్తా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 398 వ నామం.
" అవ్యక్తా " అంటే మొదటి మాయా స్మరణ స్వరూపురాలు. వ్యక్తము కానిది. భౌతిక నేత్రాలకు గోచరించనిది అని అర్ధం.
దీనిని వివరించడానికి సాధారణంగా విత్తనం, చెట్టు ఉదాహరణ చెబుతారు. మర్రి చెట్టు విత్తనం చిన్న గింజ. దానిని భూమిలో ప్రాతి నీరు పోస్తే పెద్ద చెట్టు అవుతుంది. చెట్టు వ్యక్తం, విత్తనం అవ్యక్తం అని. కాని విత్తనం కూడా కనిపిస్తూంది కదా. ఈ విత్తనం నుంచి మర్రిచెట్టు వస్తుంది అని కూడా తెలుస్తూంది కదా. అంటే విత్తనం కూడా వ్యక్తమే. అందుకే అన్నింటికీ అవ్యక్తస్వరూపం అమ్మవారే అని తెలుస్తూంది.
కేనోపనిషత్తు " నాకు ఏమీ తెలియదు అన్నవారు జ్ఞాని " అని తెలియచేస్తూంది. అదేమిటీ అనిపిస్తుంది కాని అతనికి అమ్మవారు ఇంద్రియములద్వారా తెలుసుకోలేనివారు అని తెలుసు అని గ్రహించాలి. అందుకే నాకేమీ తెలియదు అన్నాడు. తెలుసు అంటే అబద్ధం. అమ్మవారు ఎలా తెలుస్తారు.
అవ్యక్తమునండి జన్మ తీసుకుని వ్యక్తమవడం, మళ్ళీ మరణించిన తరువాత అవ్యక్తంలో కలిసిపోవడం, అదే సృష్టి కార్యక్రమం..
ఇదే విషయాన్ని గీతలో పరమాత్మ ఇలా తెలియచేసారు:
" అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః
ప్రభవంత్యహరాగమే,
రాత్ర్యాగమే ప్రలీయంతే
తత్రైవావ్యక్తసంజ్ఞకే "
- భ.గీత 8:18
" చరాచరప్రాణులన్నియును బ్రహ్మయొక్క పగటికాలము ప్రారంభము కాగానే అవ్యక్తమునుండి అనగా బ్రహ్మయొక్క సూక్ష్మశరీరమునుండి ఉత్పన్నములగును. (ప్రకటితములగును). మఱల బ్రహ్మయొక్క రాత్రికాలము ప్రారంభసమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును " అని.
అన్ని జీవుల మూలమూ అమ్మవారే.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment