" గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా - ఓ జాతీయపార్టీ అధ్యక్షుడు " - చీమలపాటి సూర్యనారాయణ

 " గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా "- ఓ జాతీయపార్టీ అధ్యక్షుడు ( రెండు రోజుల క్రితం )


                  శ్రీరస్తు శుభమస్తు 

" తస్మాత్ శాస్త్రం ప్రమాణం 

  తే కార్యాకార్య వ్యవస్థితౌ,

  జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం 

  కర్మ కర్తుమిహార్హసి " 

                ‌‌ - భ.గీత 16:24

పరమాత్మ అన్నారు అర్జునుడితో " శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చెయ్యమందో అది చెయ్యి, ఏది వద్దందో అది మానేయి " అని.

శ్రీరాముడు " ఋషులు ఇలా చెప్పారు, శాస్త్రం ఇలా చెప్పింది కనుక ఇలా చేద్దాం " అనేవారు.

రెండురోజుల క్రితం వంద సంవత్సరాల పైబడి వయస్సున్న ఓ జాతీయపార్టీ అధ్యక్షుడు " గంగలో మునిగితే పాపాలు పోతాయా " అని అడిగారు. సందేహమా లేక వ్యంగ్యమా అనేది ప్రక్కన పెట్టి విషయంలోకి వెడదాం.

ఇది ఎలాంటి సందేహం అంటే ప్రతీ ఊరులోనూ ఓ ఐస్క్రీం బండివాడు తిరుగుతూంటాడు. ఐస్ క్రీం ఐస్ క్రీం అంటూ అరుస్తూ. రోజుకు ఓ వెయ్యి సార్లు పైనే వాడు అలా అరుస్తూ ఉంటాడు. క్రీం అనేది కాళీమాత బీజాక్షరం. మరి ఈ బండివాడికి కాళీమాత బీజాక్షరనామ పారాయణ ఫలం వస్తుందా అని ఇటువంటి వారికి సందేహం కలగడం లాంటిది.

చిన్న చిన్న విషయాలకే క్రింద " షరతులు వర్తిస్తాయి " అని ఉంటుంది కదా మరి పుణ్యం కలగాలంటే ఎన్ని షరతులు ఉంటాయి.

ఎవరు స్నానం చేసినా పుణ్యం వచ్చేస్తే వేలకోట్ల ప్రజాధనం తిన్నవాడు వారం వారం ప్రత్యేక విమానంలో వెళ్ళి మరీ గంగానదిలో స్నానం చేసి వస్తాడు.

ఊరి పొలిమేరలు దాటకుండా సాధనతో ముక్తిని పొందినవారు కోట్లలో ఉంటారు. 

పితృదేవతలకు మనం పెట్టే కర్మను శ్రాద్ధం అంటాం. శ్రద్ధగా చేసేది కనుక శ్రాద్ధం అన్నారు. మరి శ్రద్ధ అంటే ఏమిటి?. శాస్త్రం చెప్పిన విషయాలలో ఉండవలసిన విశ్వాసంని శ్రద్ధ అన్నారు. కొన్ని విషయాలు భౌతిక ఇంద్రియములకు అందవు. అందుకని శాస్త్రం చెప్పినట్లు చేయాలి.

అనన్యభక్తుడు గంగవద్దకు వెళ్ళి స్నానం చేయక్కరలేదు. అనుకుంటే గంగే ఈయన వద్దకు వస్తుంది. గంగాలహరి స్తోత్రం చేస్తే పండిత జగన్నాధరాయల పాదాలు అలాగే పైకివచ్చి మరీ కడిగింది గంగానది.

శ్రీలలితాసహస్రనామాలకు భాష్యం వ్రాసారు శ్రీభాస్కరరాయలవారు. ఈయన నివసించే రాజ్యపు రాజు ఓసారి ఈయన దగ్గరకు వచ్చి " సంతానం లేదు " అని బాధపడ్డారు. ఈయన " దానిదేముంది, ఓ చక్కటి యాగం ఉంది, చేద్దాం. కొన్ని రోజులు ఇక్కడే ఉండు " అన్నారు. ఆ యాగానికి ఉదయం సాయంత్రం నదీస్నానం ముఖ్యం. అక్కడకు దగ్గరలో నది ఏదీ లేదు. భాస్కరులు " సరే సంకల్పం చేద్దాం, ఓ నదిని యాగం అయేదాకా మన గ్రామం మీదుగా ప్రవహించమని " అని సంకల్పం చేసారు. కొంచెం దూరంలో ప్రవహిస్తూన్న నది మహదానందపడిపోయింది. భాస్కరులు తనలో కొంతకాలం స్నానం చేస్తారని. వెంటనే దారి మరల్చుకుని ఆ గ్రామం మీదుగా ప్రవహించడం మొదలు పెట్టింది. నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి కాని నదులు కూడా ఎవరయినా పుణ్యాత్ములు స్నానానికి వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటాయి అని చెబుతారు పండితులు. ఇప్పటికీ ఆ గ్రామంమీదుగా ఓ నది కొంతకాలం ప్రవహించి ఆగిపోయినట్లుగా తెలియచేసే ఆనవాళ్ళు ఉన్నాయిట.

ఈ పాపాత్ముడు వచ్చి నాలో స్నానం చేయకుండా ఉంటే బాగుండునని ఏ నదీ మన గురించి అనుకోకుండా నడుచుకోవాలి ప్రతి ఒక్కరూ. ముఖ్యంగా ఇటువంటి సందేహాలతో సతమతమయేవారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ