ముక్కోటి/వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ.
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ముకుందా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 838 వ నామం.
" ముకుందా " అంటే మోక్షమును ఇచ్చునది అని భాష్యం చెప్పారు.
అమ్మవారు కరుణామూర్తి. ఎవరిని అనుగ్రహిద్దామా, ముక్తిని ఎలా ప్రసాదిద్దామా అని ఆలోచన చేస్తూ ఉంటారు. కాని ఆ అనుగ్రహాన్ని పొందడానికి సాధన అధికంగా చేయాలి.
భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది. భగవానుడికి తనవారు పరాయివారు అనే భావన ఉండదు. ఆయనకు అందరూ సమానమే. వారి వారి సాధనలను బట్టి అనుగ్రహిస్తారు. కాని కృష్ణుడు గోపికలను అనుగ్రహించాలని నిశ్చయించుకుని ఓ శరత్కాలపురాత్రి కల్పవృక్షం క్రింద నుంచుని వేణుగానం చేస్తారు. గోపికలు ఎక్కడి పనులు అక్కడే విడిచిపెట్టేసి వేణుగానం వినిపిస్తూన్న వైపుకు పరిగెడతారు.
కృష్ణుడు " ఇంత అర్ధరాత్రి పిల్లలను భర్తలను బంధువులను విడిచి ఇలా వచ్చేసారేమిటి. లోకం ఏమనుకుంటుంది " అని పరీక్ష చేయడానికి వారి బంధాలను గుర్తుచేశారు. గోపికలు " లోకంతో బంధాలు పెట్టుకున్నవారికి నువ్వు చెప్పినవన్నీ ధర్మమే. కాని బంధాలను విడిచిపెట్టేసి వచ్చాం. నీ భక్తులను అనుగ్రహించినట్లే మమ్మల్ని కూడా అనుగ్రహించు " అని కన్నీళ్ళతో వేడుకుంటారు.
ఆశ్చర్యకరంగా గోపికలు " మనం ఎంత అదృష్టవంతులం, కృష్ణుని అనుగ్రహాన్ని పొందాం. మనకన్నా అదృష్టవంతులు ఎవరయినా ఉంటారా " అనుకుంటారు. " మనకన్నా " అంటే ఏమిటి, ఎవరితోనో పోల్చుకోవడం. అంటే బంధాలు కలిగి ఉండడం. బంధాలు తొలగిపోలేదని తెలుస్తూంది. కృష్ణుడు అంతర్ధానమయి పోతారు. మళ్ళీ తప్పు తెలుసుకున్న గోపికల కృష్ణాణ్వేషణ మొదలయింది.
అలా అడుగడుగునా పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో జన్మలు సాధన చేయగా చేయగా కంచి పరమాచార్య, రమణమహర్షుల వంటి మహనీయుల జన్మ లభించి ముక్తి సాధ్యమవుతుంది.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే సమయం వచ్చినప్పుడు అమ్మవారే మోక్షాన్ని ప్రసాదిస్తారు. సంశయం నాస్తి.
ఈరోజు పరమ పవిత్రమయిన ముక్కోటి/వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment