అమ్మవారు అనుగ్రహించేదాని కన్నా పైన ఇంకేమీ ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" అనర్ఘ్యకైవల్యపదదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 926 వ నామం .
" అనర్ఘ్యకైవల్యపదదాయినీ " అంటే వెలకట్టలేని కైవల్యమను పదమును ఇచ్చునది.
కైవల్యం అంటే " కేవలస్య భావం కైవల్యం ". ఒక్కటే అంటే ఇంక పైన ఏమీ లేనిది - ముక్తి, జన్మరాహిత్యం. అమ్మవారు సదా సిద్ధంగానే ఉంటారు ముక్తిని ఇవ్వడానికి. కాని ఆ అవకాశాన్ని పొందడానికి జీవుడు ఎంత సాధన చేయాలి.
జడభరతుడు వానప్రస్థానికని అరణ్యానికి చేరుకున్నాడు. ఆకులు అలములు తింటూ మోక్షానికని కఠినసాధన చేస్తున్నాడు.
ఈ సాధన ఏ స్థితికి చేరిందంటే పూజచేయడం కూడా మర్చిపోయేటంత. భగవదనుభూతి పొందడం కోసం పూజ. ఈయన ఆ అనుభూతిలోనే ఉండిపోయి ఆనందిస్తూ ఉండేవాడు వరుసగా కొన్ని రోజులపాటు.
సూర్యమండలంలో ఇష్టదైవాన్ని ధ్యానించడం ఒక అద్భుత ఉపాసన. ఈయన ఆ స్థితిలోకి కూడా వెళ్ళిపోయాడు. ఆయన కర్మలకు అతీతుడు అంటే అవధూత స్థితిలో ఉన్నాడు. ఇక మోక్షమే తరువాయి అన్న సమయంలో ఆయన ఓ జింకపిల్ల మీద జాలిపడి, బంధం పెంచుకుని, దానిని చేరదీసి, దానితోడిదే లోకమయి మరణించి రెండు జన్మలు ఎత్తవలసి వచ్చింది మోక్షానికి. అంత కష్టమయినది సాధన.
శంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం గానం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:
" న మోక్షస్యాకాంక్షా న చ
విభవవాంఛాపి చ న మే
న విజ్ఞానాపేక్షా శశిముఖి
సుఖేచ్ఛాపి న పునః,
అత స్త్వాం సంయాచే జనని
జననం యాతు మమ వై
మృడానీ రుద్రాణీ శివ
శివ భవానీతి జపతః "
" నాకు మోక్షం వద్దు. వైభవం మీద కోరికలేదు. విజ్ఞానం మీద ఆపేక్ష లేదు. సుఖపడదామన్న కోరిక కూడా లేదు. నేనేమి అడుగుతున్నానో తెలుసా తల్లీ, నా జన్మంతా నీ జపంతో జరిగిపోతే చాలు " అన్నారు శంకరులు.
ఫలితం కోసం ఆలోచన చేయకుండా సాధన చేస్తూ ఉండడమే. అమ్మవారు ఎలాగూ అనుగ్రహిస్తారు. సందేహం అక్కరలేదు.
ఈరోజు సూర్య భగవానుడికి ప్రీతికరము, పవిత్రము అయిన మాఘపాదివారం. ఆదిత్యుని స్మరించుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment