శరీరం దృఢంగా ఉన్నప్పుడే చిత్తశుద్ధికోసం ప్రయత్నం చేయాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" ఆశ్చర్యవద్వదతి తధైవ చాన్యః,   

  ఆశ్చర్యవచ్చైనమన్యః 

  శృణోతి శ్రుత్వాప్యేనం 

  వేద న చైవ కశ్చిత్  "

              - భ.గీత 2:29

" ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ( ఈ ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేఱొక పురుషుడు  దీనిని ఆశ్చర్యకరమైనదానినిగా వినును. ఆ విన్నవారిలోకూడ  కొందరు దీనినిగూర్చి ఏమియు ఎఱుగరు " అన్నారు పరమాత్మ. 

ఎంత చక్కటి విషయం. తరచుగా మనం " ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మ ప్రబోధనానుసారం నిర్ణయం తీసుకోవడం " లాంటి విషయాలు వింటూనే ఉంటాం. అంటే తను ఒక నిత్యము సత్యము అయిన ఆత్మ అని అందరికీ తెలుసు. కాని జన్మజన్మలుగా పెంచుకుంటూ వస్తూన్న ఈ " దేహాభిమానం " పోదు. పోగొట్టుకోవడానికి ప్రయత్నించం కూడా. 

ఆత్మ గురించిన ఎన్నో విషయాలను వింటూంటాం, చదువుతూంటాం. కాని ఆ విషయాలన్నీ పనికిరానివిగా అనిపిస్తాయి. బుర్రకు పట్టవు. 

ఈ అశాశ్వతమయిన దేహానికి ఎటువంటి దుస్తులు తొడుగుదామా, కేశాలను అందంగా ఎలా అలంకరించుకుందామా, పాదాలకు ఎటువంటి చెప్పులు వేసుకుందామా అనే ఆలోచనే తప్ప ఆత్మప్రక్షాళన కోసం ఏ గుడులు దర్శిద్దాం, ఏ జపం చేసుకుందాం, ఏ పూజలు చేసుకుందాం, ఏ సంప్రదాయాలు పాటిద్దాం అని మాత్రం ఆలోచన రాదు. 

మనం దుస్తులు మార్చినంత సులభంగా ఈ ఆత్మ శరీరాన్ని మార్చేసుకుంటుంది. మరణం అంటే గుండె, మెదడు, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం కాదు. ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడమే అని కఠోపనిషత్తు తెలియచేస్తూంది. చిత్తశుద్ధి, ఆత్మప్రక్షాళనకు ఈ శరీరం అవసరమే. కాని ఇక ఈ శరీరం వలన తన ఉన్నతికి ఉపయోగమేమీ లేదు అని అనుకున్న మరుక్షణం ఆత్మ ఈ శరీరాన్ని వదిలేస్తుంది. ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది.

మనం ప్రేతం అనే మాటను వింటూంటాం. ఆత్మ ఒక శరీరాన్ని వదలిన తరువాత ఇంకో శరీరాన్ని తీసుకునే వరకూ గాలిలో తిరుగుతూ ఉంటుంది. ఆ స్థితిలోని ఆత్మను ప్రేతం అంటారు. అది కూడా ఆత్మే.‌ భయపడక్కరలేదు.

అందుకని శరీరం దృఢంగా ఉన్నప్పుడే చిత్తశుద్ధికోసం మంచికర్మలు చేస్తూ ఉండాలి. ఈ భౌతిక విషయాలన్నీ అశాశ్వతాలే అనే ఎరుకలో ఉంటే ముక్తి పొందడం అంత కష్టం కాదు. 

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ