అమ్మవారి అనుగ్రహం అంత సులభంగా దొరకదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" అభ్యాసాతిశయజ్ఞాతా " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 990 వ నామం.

"  అభ్యాసాతిశయజ్ఞాతా " అంటే అమ్మవారిని అతిశయించిన అభ్యాసం/సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు " అని అర్థం.

మూకశంకరులు తన " మూకపంచశతి " లో శ్రీకామాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తూ అంటారు - " చిరతర సుచరిత సులభః " - అంటే అమ్మవారి అనుగ్రహం పొందడం చాలా సులువుట. కాని దానికి బహుకాలం మంచిగా/శ్రద్ధగా సేవించుకోవాలి అని.

ఇదే విషయాన్ని పరమాత్మ భ.గీతలో ఇలా చెప్పారు:

" అభ్యాసయోగయుక్తేన , 

  చేతసా నాన్యగామినా,

  పరమం పురుషం దివ్యం,

  యాతి పార్ధానుచింతయన్"     

                 - భ.గీత 8:8

నా మాయను తప్పించుకోవడం మహామహుల వల్లే కాదు అని చెబుతూ ఈ శ్లోకంలో " అభ్యాసం/సాధనతో నన్ను పొందడం కష్టం కాదు " అని తెలియచేసారు. 

మరి " సాధన " అంత సులభమా. సాధకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి?.

" అప్రమత్తత/జాగ్రత్త ".

సాధకుడికి ఒక ఆశయం ఉంటుంది. అది పొందేవరకూ/పొందినతరువాతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని వేదమాత చెబుతున్నారు. ప్రతీక్షణం అడ్డంకులు కలుగుతూనే ఉంటాయి, క్రిందకి లాగేస్తూనే ఉంటుంది మాయ. ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నా అధఃపాతాళానికి పడిపోతాడు.

ఒకాయన కష్టపడి అధికారం సంపాదించాడు. అధికారం చేతిలో ఉందని రెచ్చిపోకూడదు. రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందుకని " అప్రమత్తత/జాగ్రత్త " గా ఉండి వచ్చినదానిని నిలబెట్టుకోవాలి.

ఆదిశంకరులు " అప్రమత్తత " కి ఒక అద్భుత ఉదాహరణ చెప్పారు:

" లక్ష్యత్తుతంతేద్యధిచిత్తమేషత్, 

  బహిర్ముఖం తన్నిపతే తత్సతతం,

  ప్రమాదతః ప్రత్యుతకేళికందుకః,

  సోపానబంతే పతితోయధాతధాః "

ఒకతను బంతి ఆడుతూ బహుళ అంతస్తుల భవనం ఎక్కాలని ప్రయత్నిస్తూన్నప్పుడు చాలా అప్రమత్తతో ఉండాలి. ఒక్కక్షణం అజాగ్రత్తగా ఉన్నా ఆ బంతి క్రింద పడి అక్కడే ఉండిపోదు, మెట్లమీదుగా అట్టడుక్కి వేగంగా వెళ్ళిపోతుంది. 

ప్రతీక్షణం ప్రక్కకు లాగేసే ప్రాపంచిక విషయాలను దూరంపెట్టడం అంత సులభమా?.

అభ్యాసం/సాధన చెయ్యడానికి అవసరమయే శక్తిని/సంకల్పాన్ని కూడా ఆ " అవ్యాజకరుణామూర్తి " నే ప్రసాదించమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ