జీవించడం వేరు, బ్రతకడం వేరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మృత్యుమథనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 181 వ నామం .

" మృత్యుమథనీ " అంటే మృత్యువుని పోగొట్టునది. అదెలాగ. మనం ఉన్నది మర్త్యలోకం. మరణం తథ్యం. మరి మరణాన్ని ఎలా పోగొడుతారు అమ్మవారు.

మరణం భౌతికదేహానికే కాని మనిషికి కాదు. ఆదిశంకరులు శివైక్యం చెంది 1200 సం.లు అయింది. ఇప్పటికీ అందరం ప్రతిరోజూ ఆయనను తలచుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం, పూజిస్తున్నాం. కనీసం ఇంకో 2000 సం.లు శంకరులు మనమధ్య జీవించే ఉంటారు. దీనినే అమరత్వం అంటారు.

జీవించడం వేరు, బ్రతకడం వేరు. పశుపక్ష్యాదులు కూడా బ్రతుకుతున్నాయి. జీవించడం ఒక మనిషికే సాధ్యం. దానికి సాధన కావాలి. 

ఉపనిషత్తులు ఇలా తెలియచేస్తున్నాయి:

" అసతో మా సద్గమయ

  తమసో మా జ్యోతిర్గమయ,

  మృత్యోర్మ అమృతం గమయ

  ఓం శాంతిః శాంతిః శాంతిః "

       - బృహదారణ్యక ఉపనిషత్తు 1.3.28

" నన్ను అసత్ నుండి సత్ వైపు నడిపించు.

నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించు.

నన్ను మరణం నుండి అమరత్వం వైపు నడిపించు " అని అర్ధం.

బృందావనంలో ఓ గోవు ఇలా బాధపడింది అని ఓ భక్తుడి/పండితుడి భావన:

" కృష్ణయ్యా, నువ్వు ప్రక్కనే ఉన్నా ' గడ్డి ' మీద ఆశతో అడవిలో ప్రవేశించాను. దారి తప్పాను. సంధ్య వ్రాలిపోతూంది. ఎలా బయటపడాలో తోచటంలేదు. నేను రాలేను, నువ్వే వచ్చి నన్ను రక్షించాలి. కనీసం నువ్వు వేణువు ఊదినా ఆ ధ్వని విని నీదగ్గరకు రాగలను " అని గోవు బాధపడుతూందిట.

ఎంత చక్కటి భావన. ఇది మనగురించే. ధనం( గడ్డి )మీద ఆశతో మాయాప్రపంచం ( అడవి )లో పడి తిరుగుతున్నాం. ( జీవన )సంధ్య వ్రాలిపోతూంది. ఈ మాయలోంచి ఎలా బయటపడాలో తెలియటంలేదు. ఎలా?. అమ్మవారే దయతలచి మార్గం చూపాలి.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మాయలోంచి బయటపడే మార్గం చూపిస్తారు. సంశయం అక్కరలేదు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ