బ్రహ్మ మొదలుకుని చిన్నపురుగుకు కూడా అమ్మ అమ్మవారే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ఆబ్రహ్మకీటజననీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 285 వ నామం.

" ఆబ్రహ్మకీటజననీ " అంటే బ్రహ్మగారినుండి కీటకాలవరకూ అందరికీ ఆవిడే అమ్మ. ఎంతటి అద్భుత విషయం. అన్ని జీవుల్లోనూ అమ్మచైతన్యం ఉందనేగా అర్ధం.

పరమాత్మ గీతలో ( 6:32 ) " అన్నిజీవులను సమభావంతో చూస్తూ సుఖదుఃఖాలను ఒకేవిధంగా స్వీకరించేవాడే పరమశ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయం " అన్నారు. 

కాని అలా ఉండడానికి " మోహం, మమకారం " అడ్డు పడుతుంది. కుక్కలన్నీ ఒకటే. కాని మన కుక్కని ముద్దు చేస్తాం. ఎదరివాడి కుక్కని ఛీఛీ అని కర్ర తీస్తాం.

కురుక్షేత్రయుద్ధం జరుగుతూన్నప్పుడు వ్యాసులవారు అలా వెడుతూ ఓ చిన్న పురుగును, దాని ఆరాటాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ పురుగు రథం చప్పుడు వినపడినప్పుడల్లా భయంతో ఇటూ అటూ పరిగెడుతూంది. వ్యాసర్షి చిన్న పురుగుకు ఇంత ఆరాటం ఏమిటి అనుకుని ఎందుకు అంత హైరానా పడుతున్నావు అని అడుగుతాడు. ఆ పురుగు " ఏ జీవి జీవితం దానిది. ఎవరి కష్టాలు, భయాలు వారివి. క్రితం జన్మలో చాలా చెడ్డపనులు చేసాను. కాని నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నాను " అంటే వ్యాసర్షి " క్రితం జన్మ విషయాలు కూడా గుర్తున్నాయే " అంటారు. అప్పుడు ఆ పురుగు అంటుంది " మీరు పలకరించడం వలన ఆ జ్ఞానం వచ్చింది " అని. 

తరువాత చాలాకాలం అయాక ఓ రోజు వ్యాసర్షి శిష్యులకు ఆశ్రమంలో ఏదో ఉపదేశిస్తున్నారు. ఓ రథం వచ్చి ఆగింది. దానిలోంచి ఓ చక్రవర్తి దిగి వచ్చి వ్యాసర్షి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ చక్రవర్తే క్రితం జన్మలో వ్యాసర్షితో మాట్లాడిన చిన్న పురుగు. వ్యాసర్షితో 2 నిం.లు మాట్లాడిన ఫలితంగా మరుజన్మలో చక్రవర్తిగా పుట్టాడు. సత్సాంగత్యం ఫలితం అలా ఉంటుంది.

అందుకే ఎవరినీ తక్కువగా చూడకూడదు. ఎవరిలో ఏ మహత్తు ఉందో తెలియదు. అందరిలోనూ అమ్మవారి చైతన్యమే. ఈజన్మలో స్త్రీ, మరుజన్మలో పురుషుడో, పశువో, కీటకమో తెలియదు. అందరిలోనూ అమ్మవారి చైతన్యమే.

అవధూత ఎవరికీ నమస్కరించరు, ఆశీర్వదించరు. అంతా బ్రహ్మమయినప్పుడు ఎవరు ఎవరికి నమస్కరించడం, ఎవరు ఎవరిని ఆశీర్వదించడం.

అమ్మవారు " ఆబ్రహ్మకీటజనని ".

అందరినీ చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుందాం. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ