అమ్మవారు మంచిపనులు చేసేలా అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" పుణ్యకీర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 542 వ నామం .
" పుణ్యకీర్తిః " అంటే పుణ్యమును ఇచ్చునట్టి కీర్తిగలది.
కీర్తి వచ్చేదే మంచిపనులు చేయడం వలన. అమ్మవారు చేసేవన్నీ మంచిపనులే, లోకరక్షణకోసమే కదా. ఆవిడకు కీర్తి రావడంలో ఆశ్చర్యం ఏముంది.
జీవులు మంచిపనులు చేస్తే వారికి కీర్తితో బాటు పుణ్యం కూడా ఇస్తారు అమ్మవారు.
శ్రీసూక్తంలో అమ్మవారిని ఇలా ప్రార్ధిస్తాం:
" మనసః కామమాకూతిం
వాచః సత్యమశీమహి,
పశూనాం రూపమన్నస్య
మయి శ్రీః శ్రయతాం యశః "
ఓ శ్రీదేవీ, మా మనస్సులో జనించే ఉదాత్త ఆకాంక్షలను, సంతోషాన్ని, వాక్కులో సత్యాన్ని, గోసమృద్ధిచేత, ఆహారసమృద్ధిచేత కలిగే ఆనందాన్ని నేను చవిచూడాలి. నాకు కీర్తి కలుగుగాక.
మనస్సులో మంచి ఆలోచనలు అన్నారు ఇక్కడ. మంచిపనులు, ధర్మకార్యాలు చేయాలంటే శక్తి, ధనం కావాలి. అవి అందరి దగ్గరా ఉండకపోవచ్చు. కాని మనస్సులో కూడా ఎవరికీ చెడు జరగాలని కోరుకోకుండా ఉండడానికి శక్తి, ధనం అక్కరలేదు. మంచి ఆలోచనలు చాలు. అదే మనం అమ్మవారిని కోరుకోవాలి.
మనస్సులో ఉదాత్త ( మంచి ) ఆలోచనలు, వాక్కులో సత్యం ఉంటే ఇంక కావలసినది ఏముంది. అటువంటి వారికి ఆనందాన్ని, పుణ్యాన్ని, కీర్తిని అనుగ్రహించకుండా ఎలా ఉంటారు అమ్మవారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment