కులాలు కేవలం పని విభజన కోసమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" వర్ణాశ్రమవిధాయినీ " - అమ్మవారి అద్భుతనామం. శ్రీలలితాసహస్రరహస్యనామాలలో ఇది 286 వ నామం.

" వర్ణాశ్రమవిధాయినీ " అంటే వర్ణాశ్రమాలని ఏర్పాటుచేసినది అని అర్ధం. అంటే బ్రాహ్మణ్యాది వర్ణాలను, బ్రహ్మచర్యాది వర్ణాలను ఏర్పాటుచేసినది అమ్మవారే అని అర్ధం. అంతేకాని ఈధర్మాలన్నింటినీ ఏ మనువో ( మనుష్యులు ) ఏర్పాటుచేసినవి కావు.

అజ్ఞానంతో ఇప్పుడు అందరూ అనుకుంటూన్నట్లు బ్రాహ్మణాది వర్ణాలు కులాలు కావు. కొన్ని కొన్ని పనులకు కొందరిని ఏర్పాటుచేసింది ఆవిడ. 

" చతుర్వర్ణ్యం మయా 

  సృష్టం........అవ్యయం " 

            - భ.గీత 4:13.

ఈ నాలుగు వృత్తులవారూ నాచేతనే సృష్టించబడ్డారు అన్నారు పరమాత్మ గీతలో. 

ఓ ఉదాహరణ చూద్దాం. ఒకాయన పట్నం వెళ్ళి వ్యాపారం చేసి పెద్ద ధనవంతుడయాడు. తనగ్రామంలోని ఓ నలుగురికి ఉద్యోగాలిచ్చి సహాయం చెయ్యాలనుకున్నాడు. కబురుపెట్టాడు, వచ్చారు. నలుగురికీ మేనేజర్ ఉద్యోగాలిచ్చేయడు. ఏ పనులు చెయ్యగలరో పరీక్షిస్తాడు. మంచి ఆరోగ్యంగా హుషారుగా ఉన్నవాడికి బయట డబ్బు వసూలు చేసే పని ఇస్తాడు. కొద్దిగా మొహమాటస్తుడు భయస్తుడు అయితే ఆఫీసులో ఎకౌంటెంట్ పని ఇస్తాడు. వంటలో ఆసక్తి ప్రావీణ్యం ఉన్నవాడయితే కేంటీన్ లో సూపర్వైజర్ గా పెట్టుకుంటాడు. ఏదయినా పనిచేయించుకుని పనికితగ్గ జీతాలిచ్చి వారికి సహాయపడదామనే సదుద్దేశ్యంతోనే కదా. 

అమ్మవారు కూడా జీవుడు జన్మతీసుకునే సమయంలో అతని శక్తిని అర్హతని దృష్టిలోపెట్టుకుని ఒక వర్ణంలో జన్మని ఇస్తుంది. ఆ జీవుడు తన వర్ణాశ్రమధర్మాన్ని సక్రమంగా పాటిస్తే చాలు, ముక్తినిపొందడానికి. ఒక కాపలాదారు తన విద్యుక్తధర్మాన్ని అంటే సమయానికి రావడం శ్రద్ధగా పనిచేయడం చేస్తే ముక్తిపొందేస్తాడు. అదే అతని వర్ణాశ్రమ ధర్మం. అంతేకాని అతను వేదాలు పురాణాలు చదివేసి ప్రవచనాలు అవీ చెప్పనక్కరలేదు. 

ఆర్మీ లో చేరాలంటే తగిన పొడుగు, బరువు, ఆరోగ్యం ఉండాలి కదా. మరి బక్కగా, పొట్టిగా ఉండి ఆరోగ్యం సరిగాలేని వాడిని ఆర్మీలో ఎలా పెడతారు. పెడితే అతను తన ధర్మాన్ని సరిగా పాటించగలడా. 

వారి వారి శక్తిసామర్ధ్యాలను బట్టి అంటే క్రితం జన్మలో వారి పాపపుణ్యాలను బేరీజు వేసి ఎంత తేలికగా ముక్తినిద్దామా అని చూస్తూ ఉంటుంది అమ్మవారు. అందరూ ఆవిడ పిల్లలేగా.

ఏ వర్ణాశ్రమధర్మమూ ఎక్కువదీకాదు, తక్కువదీకాదు. అన్నీ సమానమూ, ఉత్కృష్టమూ అయినవే. అమ్మవారి సృష్టిలో లోపానికి అవకాశమెక్కడుందీ. అంతా అద్భుతంగా లయబద్ధంగానే ఉంటుంది.

అలాగే అందరూ ఒకటే కదా అంటూంటారు. ఎలా అవుతుంది. పి ఎం, బేంకు రిటైరీ ఒకటెలా అవుతారు. చైర్మన్, గుమాస్తా ఒకటెలా అవుతారు. వారి వారి కర్మఫలాలని బట్టి వారి స్థితులు, నడవడికలు ఉంటాయి. 

ఇంకా ఆశ్చర్యకరమూ వింతయిన విషయమేమిటంటే అలా అంతా సమానమే అని గొడవచేసేవారే తమ క్రింద పనిచేసే చిరు ఉద్యోగులచేత బూట్లు తొడిగించుకోవడం మోయించడం నానా అడ్డచాకిరీ చేయించుకోవడం చేస్తూ ఉంటారు. అంతా మిధ్య. 

ఆ కరుణామూర్తిని మన మన ధర్మాల్ని సక్రమంగా చేసుకునేటట్లుగా మనల్ని అనుగ్రహించమని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ