వైరాగ్యం మోక్షానికి మొదటి మెట్టు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" విరాగిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 937 వ నామం .
" విరాగిణీ " అంటే వైరాగ్యము గలది.
జీవితం సుఖమయంగా సాగాలన్నా, మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా, అమ్మవారిమీద మనస్సు నిలవాలన్నా వైరాగ్యం ముఖ్యం. బంధాలు/మోహం తగ్గించుకునే కొలదీ మనస్సు నిర్మలంగా ఉండి మంచి ఆలోచనలు కలుగుతాయి.
విద్య ఉన్నవారు విద్యనిస్తారు. ధనం ఉన్నవారు ధనాన్ని ఇస్తారు. మనకు కావలసిన వైరాగ్యం అమ్మవారి దగ్గర కావలసినంత ఉంది. నమ్ముకున్న వారికి అవసరమయినంత ఇస్తారు.
అర్జునుడు పరమాత్మని అడుగుతారు " ఈ మనస్సు కోతి కదా, దీనిని అదుపులో పెట్టడం అంత సులభమా, సాధ్యమా " అని. అర్జునుడే అలా అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?.
పరమాత్మ ఇలా అంటారు:
" అసంశయం మహాబాహో
మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేణ చ గృహ్యతే "
- భ.గీత 6:35
మనస్సు నిగ్రహించుకోవడం కష్టమే కాని వైరాగ్యంతో కూడిన సాధనతో కష్టం మాత్రం కాదు అన్నారు పరమాత్మ. " వైరాగ్యేణ చ " అన్నారు. అంటే సాధన ఒకటే సరిపోదు. వైరాగ్యం కూడా అవసరం అన్నారు.
వైరాగ్యం అంటే పూర్తిగా ఏమీ పట్టించుకోకుండా విరాగిగా అయిపోవడం కాదు. ఓ కోరిక కలగగానే తన స్థాయి ఏమిటి, ఇది తనకు తగునా/అవసరమా అని ఓ క్షణం ఆలోచిస్తే చాలా కోరికలు దూరమవుతాయి. జీవితం ఆనందమయం అవుతుంది.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అటువంటి వైరాగ్యంని అనుగ్రహించమని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment