అమ్మవారు ఆలస్యం చేయరు ఆర్తితో పిలిస్తే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" క్షిప్రప్రసాదినీ " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 869 వ నామం.
" క్షిప్ర " అంటే వెంటనే అని అర్ధం. మన వేడుకోవడమే ఆలస్యం, అమ్మవారు వెంటనే వచ్చేస్తారు, అనుగ్రహిస్తారు. ఎవరు పిలిచినా అలా వచ్చేస్తారా?.
శ్యామశాస్త్రిగారు అద్భుత వాగ్గేయకారకుడు. శ్రీకామాక్షీదేవీ ఉపాసకులు. ముత్తుస్వామిదీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగయ్యలను త్రిమూర్తులుగా కొనియాడుతారు.
శ్యామశాస్త్రిగారు నివసించే రాజ్యానికి ఓ వాగ్గేయకారుడు వచ్చి రాజుతో " నాతో పోటీచేసి గెలిచేవారెవరయినా ఉన్నారా మీ రాజ్యంలో " అని అడుగుతాడు.
గూఢచారులు చెప్పిన విషయం ఈయన చాలా రాజ్యాలలో గాయకులను ఓడించి ఇక్కడకు వచ్చారని. దానితో రాజు శ్యామశాస్త్రిగారిని కలిసి పరువు దక్కించమని కోరతారు.
శ్యామశాస్త్రిగారు తను ప్రతిపాదించిన " చింతామణి " రాగంలో " దేవీ బ్రోవ సమయమిదే, అతి వేగముగ వచ్చి నావెతలు తీర్చి కరుణించవే శంకరీ కామాక్షీ ............" అని అమ్మవారిని ప్రార్ధించడం, వచ్చిన విద్వాంసుడు ఓటమిని అంగీకరించడం జరిగింది.
ఈ కీర్తనలో శాస్త్రిగారు " సుజన దాస జన...." అని వేడుకుంటారు. అమ్మవారు " అభ్యాతిశయజ్ఞాత " - అంత వేగంగా వచ్చి ఆదుకుంటుందా. అలా ఆదుకోవాలంటే కోరుకున్నవారు ఎలాంటివారయి ఉండాలి. " సుజన దాస జన " - మంచివారు అయి ఉండాలి, శరణాగతి కోరాలి.
శ్యామశాస్త్రిగారు అటువంటి వారు కనుకనే అమ్మవారు వెంటనే వచ్చి ఆదుకుంది.
" ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి, ననుబ్రోవమని చెప్పవే ...." అని ఆర్తితో వేడుకుంటాడు భక్తరామదాసు. రామలక్ష్మణులను వెంటనే పంపిందిగా సీతమ్మతల్లి.
" అన్యధా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ " అని ఆర్తిగా పిలిస్తే " అవ్యాజకరుణామూర్తి " రాకుండా ఎలా ఉంటారు. అలా రావాలంటే మనం ఎలా ఉండాలి అనే ఎరుకలో ఉండాలి ఎల్లప్పుడూ.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment