మహాశివరాత్రి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" దర్శనాత్ అబ్రసదసి
జననాత్ కమలాలయే
స్మరణాత్ అరుణాచలే
కాశ్యాంతు మరణాన్ ముక్తిః "
- కాశీఖండం
అబ్రసదసి అంటే చిదంబరం. చిదంబరంలో నటరాజేశ్వరుని దర్శించినవారికి, తిరువారూర్ ( కమలాలయం అంటే తిరువారూర్ - అమ్మవారు కమలాంబ ) లో జన్మించినవారికి, అరుణాచలేశ్వరుని స్మరించినవారికి, కాశీలో మరణించినవారికి " ముక్తి " లభించడం తధ్యం అని పురాణం తెలియచేస్తూంది.
కాశీఖండంలో "కాశ్యాంతు మరణాన్ ముక్తిః" అన్నారు శ్రీనాధ మహాకవి.
కాశీలో మరణిస్తే ముక్తే. ముక్తి ఎలా కలుగుతుంది అంటే:
" పాలిండ్లు కదలంగా పసిడి
పైయెద వీచు అచలాధిపుని
కూర్మి ఆడుబిడ్డ, ధుఃకారమొనరించు
తొండంబు ముక్కున శిఖరారావము
జిలుకు డుంఠి, అని ప్రత్యక్షమైవచ్చి
భాగీరధీ గంగ మృదుల హస్తంబు చాచి
మేను నిమురు, ప్రధమోత్తముండు
భృంగి భయరక్షణార్ధంబు ఫాలాగ్రమున
దీర్చు భసిత రేఖ, దక్షిణ శృతి
మీదుగా ధాత్రి త్రెళ్లి, పెద్ద నిద్రకు
మాగన్ను పెట్టువేళ, పంచజనులకు
తారక బ్రహ్మ విద్య
అభవుడుపదేశమొనరించు కాశి "
భావం: జీవుడు ఊపిరి అందక మరణావస్థలో ఉన్నప్పుడు:
1. చక్కటి సువాసనలు వెదచల్లుతూ, గాజుల, కాలియందెల చప్పుడు వినిపిస్తుండగా పర్వత రాజపుత్రి అయిన పార్వతీదేవి వచ్చి జీవుడి తలను తన ఒడిలో పెట్టుకుని తన పమిటతో గాలి వీచేసరికి జీవుడు స్వాంతన పొందుతాడు.
2. డుంఠి గణపతి వచ్చి ఎగఊపిరి తీస్తున్న జీవుడికి తన చల్లటి తొండంతో ముక్కు దగ్గర నిమురుతాడు.
3. ఇక దేహం విడిచిపెట్టేస్తున్నాను అనే భయంతో వేడెక్కిపోయిన జీవుడి శరీరాన్ని తన చల్లటి చేతులతో గంగమ్మ నిమిరేసరికి హాయిని పొందుతాడు.
4. ప్రమధ గణములలో ఉత్తముడైన భృంగి జీవుడి నుదుటిపైన ఇక భయపడవద్దని విభూది పెడతాడు.
5. చక్కటి సువాసనలు వెదజల్లుతుండగా, గణ గణ గంటల ధ్వనులు వినిపిస్తుండగా, సాక్షాత్తూ కాశీ విశ్వనాధుడే వచ్చి జీవుడి పక్కన కూర్చుని, ముందుకి వంగి జీవుడి కుడి చెవిలో తారకమంత్రాన్ని ఉపదేశించగా, జీవుడు తారకమంత్రాన్ని స్మరిస్తాడు. మరణ సమయంలో తారకాన్ని స్మరించాడు అన్న ఒకే ఒక్క కారణంగా ఆ జీవుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు శివుడు.
అవ్యాజకరుణామూర్తి.
కాశీ వెడితే పుణ్యం వస్తుందా అంటూంటారు కొందరు మూఢులు. అసలు ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే కాని కాశీ వెళ్ళడమే కుదరదు. ఇంక కాశీలో మరణించాలంటే ఎన్ని జన్మలలో పుణ్యం చేసి ఉండాలి.
జ్ఞానదృష్టితో చూసిన యోగులు అక్కడ మరణించిన క్రిమికీటకాదులు సైతం కుడిచెవి పైకి పెట్టి మరణించటాన్ని దర్శిస్తారు. అంత పవిత్రం కాశీక్షేత్రం.
ఈరోజు పరమ పవిత్రమయిన శివరాత్రి. జన్మకో శివరాత్రి అంటారు. ఓం నమశ్శివాయ అని స్మరిస్తూ కాలస్వరూపుని కాలభైరవాష్టకం చదువుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీశివార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment