రథసప్తమి ఈరోజు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మార్తాండభైరవారాధ్యా " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 785 వ నామం.
మార్తాండుడు అంటే సూర్యభగవానుడు. ఆయనచే ఆరాధించబడినది అని అర్ధం.
అమ్మవారి శక్తిస్వరూపాలు ఐదు - మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ, నాలుగవది సూర్యమండలాంతర్వర్తిని అయిన గాయత్రీదేవి, ఐదవది గోకులవాసిని రాధాదేవి.
మార్తాండ అంటే చనిపోయిన జీవి ( అండం ) లో కూడా చైతన్యం కలిగించే వాడు అని అర్ధం.
ఇంతమంది ఆరాధిస్తున్నారు కదా అమ్మవారిని మరి " సూర్యుడు చే ఆరాధింపబడిన " అని ఎందుకు అమ్మవారి నామాలలో ఒక నామంగా చెప్పబడింది. దీనితోనే తెలుస్తూంది సూర్యుడి గొప్పదనం.
సూర్యుడు వేల సంవత్సరాలుగా భారతీయుల జీవితాలలో ఒక ముఖ్యభాగమయ్యాడు. " ఆయనకి నమస్కరిస్తారేమిటో మూఢనమ్మకం కాకపోతే " అని విదేశీయులతో పాటు మనవారు కూడా కొంతమంది అనుకోవడం కద్దు. కాని 2 రోజులు ఆయన కనబడకపోయినా విలవిలలాడిపోతారు అమాయకులు.
అమ్మవారు జీవులకు కాలచక్రం ఏర్పాటుకోసం ఆలోచించినప్పుడు సూర్యదేవుడు ఉద్భవించాడుట.
" .....పృధివ్యా ఔషధీయః, ఔషధీభ్యో అన్నం, అన్నాత్ పురుషః " అన్నాయి వేదాలు. జీవులమనుగడకు అవసరమైన ఔషధులను, అన్నాన్ని ఇచ్చేది సూర్యుడే. అందుకే " ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ " అన్నాయి శాస్త్రాలు.
కృష్ణయజుర్వేదం లోని " అరుణం " లోనూ, సూర్యమండల స్తోత్రం లోనూ ఆయన గొప్పదనాన్ని అద్భుతంగా లోకానికి చాటారు మన ఋషులు. ఆయన్ని " హరిదశ్వాయనమః " అని పూజిస్తాం, ఆకుపచ్చదనాన్ని ఇస్తాడు కనుక. " మిత్రాయనమః " అని పూజిస్తాం. మిత్ర అనే కిరణం వల్లే భూమిలో " జిడ్డు/ నూనెలు " ఉద్భవిస్తాయని తెలుసుకున్నారు మన ఋషులు.( ఎడారిదేశాల్లో ఎండ ఎక్కువ, అందుకే పెట్రోల్ ఎక్కువ దొరుకుతూందేమో అక్కడ).
" కలయితి నియతి ఇతి కాలః " - కాలాన్ని నియంత్రిచేవాడు అని అర్ధం. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అన్నీ ఆయనవల్లే ఏర్పడ్డాయి.
మృతప్రాయమైన లోకానికి చైతన్యం కలిగిస్తాడు. తెల్లవారేసరికి పక్షులు చెట్లతో సహా జీవులన్నీ చైతన్యాన్ని పొందుతాయి. అందుకే ఆయన లేని రాత్రికాలాన్ని దోషకాలం అన్నారు ఋషులు.
గాయత్రీమంత్రానికి అధిదేవత సూర్యుడు ( వామనపురాణం ). ఇక్ష్వాకు ( రాముడి ) వంశానికి కులదైవం సూర్యదేవుడు.
మహాపండితుడిగా కీర్థించడబడ్డ హనుమంతుడు విద్యనభ్యసించింది సూర్యుడి వద్దే. రామరావణయుద్ధ సమయంలో రాముడు అలసిపోవడంతో అందరూ భయపడిపోయి అప్పుడు దక్షిణభారతంలో ఉన్న ఋషి అగస్త్యుణ్ణి పిలిపిస్తారు. విషయం చెబితే ఆయన రాముణ్ణి " ఆదిత్యహృదయం " పారాయణ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. అగస్త్యుడికి ఎంత నమ్మకం అంటే అది పారాయణ చేస్తే శక్తిరావడం, రాముడి చేతిలో రావణుడు మరణించడం ఖాయమని - అందుకే చెప్పి వెళ్ళిపోయాడు.
పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అతిధులు ఎక్కువయి కష్టబడుతూంటే శ్రీకృష్ణుడు ధర్మరాజుని సూర్యప్రార్ధన చెయ్యమంటారు. అప్పుడే ధర్మరాజుకి " అక్షయపాత్ర " ని ప్రసాదిస్తాడు సూర్యుడు.
" సూర్యనమస్కారాలు " ఆరోగ్యానికి ఎంతటి ఉపయోగమో ఇప్పుడిప్పుడే జనాలు తెలుసుకుంటున్నారు.
ఎవరిగొప్పదనమైనా చెప్పాలంటే ఓ కధ ద్వారా చెబితే పామరులకి కూడా బాగా అర్ధమవుతుంది. పురాణాలు అందుకే కధలు కధలుగా చెప్పబడ్డాయి అని తెలుసుకోవాలి.
సూర్యదేవుడు అంతటి మహనీయుడు కనుకే అమ్మవారి నామాల్లో చేర్చబడ్డాడు. ఆయన్ని తలచుకోకుండా రోజు గడవదు మన భారతీయులకు.
" భాస్కరాయ విద్మహే
మహాద్యుతికరాయ
ధీమహి, తన్నో ఆదిత్యః
ప్రచోదయాత్ ".
ఈరోజు రథసప్తమి. పవిత్రమయిన రోజు. ఆదిత్యనామజపం చేసుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment