కేనోపనిషత్తు " ఏమీ (బ్రహ్మం) తెలియదు అన్నవాడు జ్ఞాని " అంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" వేద్యవర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 652 వ నామం .

" వేద్యవర్జితా " అంటే తనకంటె తెలియదగినది ఏమీ లేనిది అని భాష్యం చెప్పారు.

" బ్రహ్మసత్యం జగన్మిధ్య, 

   జీవో బ్రహ్మ ఏవ నపరః " అన్నారు ఆదిశంకరులు. బ్రహ్మమే సత్యం. ఆ బ్రహ్మమే అమ్మవారు. ఈ విషయం తెలుసుకున్నవాడు జ్ఞాని. ఇంక అతను ఏమీ తెలుసుకునే విషయమే లేదు.

ఆశ్చర్యకరంగా కేనోపనిషత్తు జ్ఞానికి నిర్వచనం వేరేగా తెలియచేసింది:

" యస్యామతం తస్య మతం

  మతం యస్య న వేద సః,

  అవిజ్ఞాతం విజానతాం 

  విజ్ఞాతమవిజానతామ్ " -  ‌(2,3)

" ఎవరైతే తనకు ఏమీ తెలియదని అనుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియును.  కారణం అతనికి బ్రహ్మము ఇంద్రియ గోచరం కాదు, దానిని సమాధి నిష్ఠలో మాత్రమే తెలుసుకోగలమనే జ్ఞానం ఉంది గనుక.   ఎవరైతే తనకు బ్రహ్మము తెలుసుననుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియదు.  దానికి కారణం బ్రహ్మము ఇంద్రియగోచరమనే భ్రమలో అతడు ఉన్నాడు గనుక " అని. ఎంత అద్భుతం మన వాజ్మయం.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" సుఖమాత్యంతికం యత్తత్ 

  బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్,

  వేత్తి యత్ర న చైవాయం 

  స్థితశ్చలతి తత్త్వతః "

            -  భ.గీత 6:21

" సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో, వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనందానుభూతి పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి, నిత్య పరమసత్యము ( బ్రహ్మము ) నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు ".

" తక్కువేమి మనకు 

   రాముండొక్కడుండువరకు,

   ప్రక్కతోడుగా భగవంతుడు 

   తన చక్రధారియై చెంతనె యుండగ 

   తక్కువేమి మనకు...................." అంటారు భక్త రామదాసు. అటువంటి వారికి ఏ కోరికలు ఉండవు.

అమ్మవారి ధ్యానంలోనే సదా ఉండే జ్ఞానిని ఈ భౌతిక విషయాలు స్పృశించడం కూడా వీలుపడదు. అతను దివ్య ఆనందానుభూతిలో మునిగి తేలుతూ ఉంటాడు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ