భీష్మ ఏకాదశి నేడు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏 "శ్రీరస్తు శుభమస్తు"🙏
" న తత్ పరస్య సందధ్యాత్
ప్రతికూలం యదాత్మనః "
భీష్ముడు అంపశయ్యమీద ఉన్నప్పుడు ధర్మరాజు ఆయననుండి ఎన్నో ధర్మసూక్ష్మాలు తెలుసుకున్నాడు.
ధర్మరాజు " మనిషి పాటించవలసిన అతి ముఖ్యమైన ధర్మం ఏమిటి " అని అడుగుతాడు భీష్ముడిని.
అప్పుడు ఆయన పైవిధంగా చెబుతారు - " ఎదుటి మనిషి ఏపని చేస్తే నీకు కోపం, కష్టం, బాధ, అసౌకర్యం కలుగుతాయో ఆపని నువ్వు చెయ్యకపోవడమే అతి ముఖ్యమైన ధర్మం " అని.
ఎంత అద్భుతమైన విషయం, 5000 ఏళ్ళ ( కనీసం అందరూ అనుకుంటూన్నట్లుగా ) క్రితం చెప్పబడింది. ఇంకో 10000 ఏళ్ళ తరువాతైనా ఇది కనుక పాటిస్తే ఏ గొడవలు ఉండవు.
మహాభారతయుద్ధం అయినతరువాత చక్రవర్తి పీఠం అధిరోహించినా ధర్మరాజుకి మనశ్శాంతిలేక బాధపడుతూంటాడు. ఆయన శ్రీకృష్ణుడిని సోదరులను తీసుకుని అంపశయ్యమీద ఉన్న భీష్ముడి దర్శనానికి వెళ్ళి " తాతా ఈ సంపదలేవీ నాకు సుఖాన్ని, మనశ్శాంతిని ఇవ్వట్లేదు. ఏమిచెయ్యాలి, ఎవరిని కొలవాలి " అని అడుగుతాడు. అప్పుడు అంతా ఈ పరమాత్మే అని నమస్కారం చేసి పరమాద్భుతమయిన " విష్ణుసహస్రం " స్తోత్రం చేస్తారు. భీష్ముడు అష్టమినాడే పరమాత్మలో లీనమయిపోయినా ఆయన " విష్ణుసహస్రం " కి పరమసంతుష్టుడయిన పరమాత్మ " నాకు ఎంతో ఇష్టమయిన ఏకాదశి రోజులలో ఈ " మాఘశుద్ధ ఏకాదశి " ని భక్తులు భీష్మఏకాదశి గా జరుపుకుని తరిస్తారు " అని అనుగ్రహించారు భీష్ముడిని.
ధర్మరాజు " తాతా ఇంత అద్భుతంగా విష్ణుసహస్రం ని ఎలా చెప్పావు " అని అడుగుతే " యాని నామాని గౌణాని....." అంటే నేను కేవలం ఆయన గుణాలనే చెప్పాను. ఆయన గుణాలు అంత అద్భుతంగా ఉండడంవల్ల విష్ణుసహస్రం అంత అద్భుతంగా అనిపించింది నీకు అని అన్నారు. ఎంత అద్భుత సంభాషణ.
" అవ్యాజకరుణామూర్తి " పరమాత్మని అందరికీ ఆనందదాయకమైన జీవితాన్ని ప్రసాదించి అనుగ్రహించమని కోరుకుందాం.
ఈరోజు పరమపవిత్రమయిన " భీష్మ ఏకాదశి ". పరమపూజ్యులయిన భీష్ముడిని తలుచుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణపరమాత్మార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment