మాఘపాదివారం నేడు, శ్రీఆదిత్యాయనమః - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ
శివస్కంధః ప్రజాపతిః
మహేంద్రోధనదః కాలో
యమస్యోమోహ్యపాంపతిః "
- ఆదిత్యహృదయం
" య ఏషో అంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే " అను మంత్ర ప్రమాణమును బట్టి యోగులకు సాక్షాత్కరించు ఈ హిరణ్మయపురుషుడే చతుర్ముఖబ్రహ్మ అగుచున్నాడు. తనవలన సృష్టించబడిన ప్రపంచమును పాలించు వాడగుటచే ఇతడే విష్ణువుగాను, అపరిమిత కళ్యాణస్వరూపుడగుటచే సాక్షాత్ శివుడుగాను, శతృవులను నిర్మూలించే కుమారస్వామిగాను, " ప్రజాపతిశ్చరతి గర్భే అంతః " అను శృతిననుసరించి ప్రజాపతిగాను, స్వభావముచేతనే సకలైశ్వర్యములకు పెన్నిధి అగుటచే మహేంద్రుడుగానూ కొలవబడుతున్నాడు. " అన్నాదౌ వసుదానః " అను శృతి ననుసరించి ధనధాన్యములను ఒసగు కుబేరుడితడే. జగత్సంహారగుటచే కాలుడు అనియు, సమస్త ప్రపంచమునకు నియామకుడగుటచే యముడు అనియు, అఖిల ప్రాణులయందు చైతన్యరూపమగు అమృతము చిలుకుటచేత ఉమామహేశ్వరాత్మకమగు అర్ధనారీశ్వరుడు అనియు పిలువబడుతున్నాడు. ఇతడే వరుణుడు, యపాంపతి అయి ఉన్నాడు.
ఈ శ్లోకం అగస్త్యుడు శ్రీరాముడికి రావణసంహారం కోసం ఉపదేశించిన ఆదిత్యహృదయంలోనిది. ఈ ఒక్క శ్లోకం చదువుతే చాలు మనమందరం సూర్యదేవుని ప్రత్యక్షనారాయణుడని ఎందుకు వేల సంవత్సరాలుగా కొలుస్తున్నామో తెలుస్తుంది.
అమ్మవారి భక్తులు " భానుమండలమధ్యస్థా " అని, వైష్ణవులు " ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణః " అని, శైవులు " సౌరమండల మధ్యస్థం సాంబం " అని కొలుస్తారు.
మనం నిముషానికి 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాల చొప్పున రోజుకు 21600 శ్వాసలు జరుపుతాం అని యోగశాస్త్రం చెబుతూంది. దీనిలో మొదటి 600 ( అంటే 40 ని.ల శ్వాస ) శ్వాసలకు అధిపతి గణపతి. దేవతలలో గణపతి మొదటివారు కనుక సూర్యోదయం అవగానే మొదటి 40 ని.లు సూర్యమండలాంతర్వర్తి అయిన గణపతిని ఆరాధిస్తే విశేషఫలితాన్ని ఇస్తుంది అని తెలుస్తూంది. అలాగ గణపతిని కూడా ఆదిత్యమండలస్వరూపముగా పూజించడం జరుగుతూంది.
ఆవిధంగా సకలదేవతలూ సూర్యమండలంలో స్థితులయి ఉన్నారని తెలుస్తూంది. అందుకే వేల సంవత్సరాలుగా మనం త్రిసంధ్యలలోనూ సూర్యారాధన చేస్తున్నాం. మనకు మేలు చేస్తూన్న సూర్యుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం.
గరుడపురాణం ఆదిత్యగాయత్రిని ప్రసాదించింది:
" ఆదిత్యాయ విద్మహే
విశ్వభావాయ ధీమహి
తన్నో సూర్యః ప్రచోదయాత్"
ఇందులో విశ్వభావాయ అన్నారు. అంటే విశ్వమంతా ఒకటే, అందరూ నావారే అనే భావన కలిగించమని. అందుకే అందరూ తెలుసుకోవలసినది సనాతనధర్మానికి సాటి అయినది లేదు, ఇంకొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా రాబోదు అని.
ఈరోజు పవిత్రము, సూర్యునికి ప్రీతికరము అయిన మాఘపాదివారం. సూర్యుని స్మరించుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీసూర్యదేవార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment