సత్యం మాట్లాడితే అమ్మవారి పూజ చేసినట్లే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సత్యవ్రతా " - అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 817 వ నామం. 

" సత్యవ్రతా " - అంటే " సత్యమే ప్రియవ్రతముగా గలది " అని అర్ధం.

సత్యం మాట్లాడడం తపస్సు అన్నారు పరమాత్మ:

" అనుద్వేగకరం వాక్యం 

  సత్యం ప్రియహితం చ యత్,

  స్వాధ్యాయాభ్యసనం చైవ 

  వాజ్ఞ్మయం తప ఉచ్యతే "

               - భ.గీత 17:15 

ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది అన్నారు పరమాత్మ.

భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది. శుక్రాచార్యుడు బలిని దానం ఇవ్వవద్దంటాడు. బలి అలా చేయడం తప్పు అంటాడు. అప్పుడు శుక్రుడు అంటారు:

" వారిజాక్షులందు, వైవాహికములందు

  ప్రాణవిత్తమాన భంగమందు

  చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు

  బొంకవచ్చు నఘము పొందదధిప "

కొన్ని సందర్భాల్లో అసత్యం ఆడవచ్చు అంటారు శుక్రుడు. కాని బలి వినడు.

కాని భారతంలో " అశ్వత్థామ హతః ( కుంజరః ) " అని అనమంటే ధర్మరాజు మొదట ఒప్పుకోలేదు. కాని అందరూ అలా అనడం తప్పు కాదు అంటే సరే అని అనేస్తారు. 

అమ్మ కూడా పిల్లల క్షేమం దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు చిన్న చిన్న అబద్ధాలు ఆడవలసి వస్తుంది. తప్పు కాదు. మాట్లాడేటప్పుడు కుటుంబ గౌరవం, క్షేమం, సమాజహితం దృష్టిలో పెట్టుకోవాలి.

అందుకే రామకృష్ణపరమహంస " ఈ కలికాలంలో యజ్ఞాలు, పూజలు, తపాలు, జపాలు మొగునవి చెయ్యడం కష్టమే కనుక వీలయినంత వరకూ సత్యం మాట్లాడుతూ ఉండడమే ముఖ్యమైన వ్రతం " అన్నారు.

సత్యం అన్నా, సత్యం మాట్లాడే వారన్నా అమ్మవారికి ప్రీతి. సత్యవ్రతాన్ని పాటిస్తే అమ్మవారి పూజ చేసినట్లే అని తెలుసుకోవాలి. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ