సప్తాశ్వం అంటే విబ్జార్ ( VIBGYOR ) - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" సప్తాశ్వరథమారూఢం
ప్రచండం కశ్యపాత్మజం,
శ్వేతపద్మధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం "
పూజ్యులు సామవేదంవారు సూర్యదేవుడి గురించి ప్రవచనం చేస్తూ కొన్ని అద్భుత విషయాలు తెలియచేసారు.
" సప్తాశ్వం " అంటే 7 గుర్రాలు అని చాలామంది భావన. కాని " అశ్వం " అంటే వేగంగా ప్రయాణించునది అని చెబుతూంది వేదం:
" ఏకో అశ్వో వసతి సప్తనామా "
" ఒకే కిరణం 7 వర్ణాలుగా ఉన్నది ( కనిపిస్తూంది )" అని.
అదే విబ్జార్ ( VIBGYOR ) గా తెలుస్తూన్నది.
మార్కండేయపురాణం " ఓంకారం సప్తస్వరాలుగా అయినది " అని తెలియచేస్తూంది. అందుకే సంగీతంలో ఉన్న 7 స్వరాలూ ప్రణవం అంటే ఓంకారం నుంచే వచ్చినవి అని గ్రహించాలి.
అందుకే త్యాగయ్య గారు " ప్రాణాలల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై..." అని కీర్తించారు.
సూర్యుడి నుంచి వచ్చే నాదాన్ని వింటే " ఓంకారం " లా ఉంది అని కొందరు పరిశోధకులు చెబుతున్నారు ఇప్పుడు. మన ఋషులు ఏనాడో చెప్పిన విషయం ఇది - శక్తివంతమయిన ఓంకార స్వరూపమయిన శ్రీగాయత్రీ మహామంత్రానికి అధిపతి సూర్యదేవుడు.
ఇక కాలపరంగా చూస్తే వారంలో ఉన్న 7 రోజులే తిరిగి తిరిగి వస్తాయి. 8 వది లేదు. ఈ 7 రోజుల ఏర్పాటు వేదమే చేసింది. ఏరోజు ఏదవుతుంది అన్నది ఆరోజు మొదటి " హోర " ను బట్టి ఉంటుందని కూడా వేదమే చెప్పింది. హోర అంటే గంట ( HOUR ). రవిహోరతో మొదలయినది ఆదివారం అయితే రవిహోర నుంచి 25 వది చంద్రహోర, సోమవారం అవుతుంది. ఎంతటి అద్భుత శాస్త్రీయత. వేల సంవత్సరాలక్రితం వేదం ప్రసాదించిన కాలగణననే ఇప్పటికీ ప్రపంచం అనుసరిస్తూంది. ఎంతటి అద్భుత విజ్ఞానం.
7 వర్ణాలు, 7 రాగాలు, 7 రోజులు - ఇలా 7 సంఖ్యకు సూర్యుడికి ఎంతో సంబంధం ఉంది.
" మార్తాండ " ఆయన నామం. అంటే చనిపోయిన అండానికి కూడా చైతన్యాన్ని ఇస్తాడు అని. ప్రకృతికి చైతన్యాన్ని ఇచ్చేది సూర్యుడే.
" ఉదయే బ్రహ్మస్వరూపాయ
మధ్యాహ్నేతు మహేశ్వరః
అస్తమానే స్వయం విష్ణుః
త్రయీమూర్తిః దివాకరః "
సూర్యుడు " త్రిమూర్తి " స్వరూపుడు.
ఈరోజు మాఘపాదివారం. పవిత్రమయిన రోజు.
అతి పవిత్రమయిన ఈ రోజున అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని " ప్రత్యక్ష నారాయణుడు " సూర్యదేవుడిని ప్రార్థిద్దాం - సూర్య.
సర్వే జనాః సుఖినో భవంతు.
శుభం భూయాత్
Comments
Post a Comment