ఎంత నిగ్రహించుకున్నా మనస్సు సుఖాలవైపు లాగేస్తూ ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" యతతో హ్యపి కౌంతేయ      

   పురుషస్య విపశ్చితః,

   ఇంద్రియాణి ప్రమాధీని   

   హరంతి ప్రసభం మనః "

              - భ.గీత 2:60

" ఓ అర్జునా! ఇంద్రియములు ప్రమధనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు  ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవఱకును  అవి అతని మనస్సును ఇంద్రియార్ధములవైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును " అన్నారు పరమాత్మ.

ఎంతటి అద్భుత విషయం తెలియచేసారు పరమాత్మ. ఇది సహజం. ఎంత నిగ్రహించుకుందామన్నా మనస్సు లాగేస్తూ ఉంటుంది. 

రామాయణంలో సీతమ్మ బంగారులేడిని చూసి కావాలంటుంది. అది రాక్షసుల మాయ అని చెబుతారు రామలక్ష్మణులు. ఉన్నది పరాయి ప్రదేశం. అప్పటికే ఖరదూషణాదులు యుద్ధానికి రావడం, వారిని రాముడు చంపడం జరిగింది. శూర్ఫణఖ అవమానింపబడి కోపంతో ప్రతీకారేక్షతో తిరిగి వెళ్ళింది. ఎంత జాగ్రత్తగా ఉండాలి అటువంటి సమయంలో. కాని సీతమ్మ మానవకాంత. ఆవిడ మనస్సు కూడా మన మనస్సు లాంటిదే. రాముడు కూడా మానవుడే. అందుకే సీతమ్మ కోరడం రాముడు వెళ్ళడం జరిగింది.

ఆశ్చర్యకరంగా సుగ్రీవుడు కూడా ఇలాగే ప్రవర్తించాడు. ఎప్పుడు వాలి వచ్చి చావకొడతాడో అని భయంభయంగా గడుపుతూన్నప్పుడు వాలిని చంపి తనను రాజును చేసిన రాముడికి తగిన సహాయానికి ప్రయత్నాలను వెంటనే ప్రారంభించాలి కదా. కాని ఇంద్రియసుఖాలకు లోనై రాముడిని విస్మరించాడు. లక్ష్మణుడు వచ్చి కన్నెర్ర చేస్తేనేకాని తప్పును గ్రహించలేకపోయాడు.

ఇదే పరమాత్మ చెప్పినది. ఎంత నిగ్రహించుకున్నా మనస్సు సుఖాలవైపు లాగేస్తూ ఉంటుంది. అందుకని తగినంత జాగ్రత్తగా ఉండాలి. 

పరమాత్మ పాదాలను ఆశ్రయిస్తే మనస్సు మన చెప్పుచేతల్లో ఉండేలా అనుగ్రహిస్తారు.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ