మరణం కూడా సుఖంగా ఉంటే అదృష్టం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" ఓం త్ర్యంబకం  యజామహే  ...........

  మృత్యోః  ముక్షీయమా2మృతాత్ "

మహామృత్యుంజయమంత్రజపం పారాయణ చేస్తే అపమృత్యువు తొలగడం, వ్యాధులనివారణ జరగడం లాంటివి ఉండవు. ఆయన లయకారకుడు, మృత్యువు ని తప్పించడు కాని ఆయన్ని నమ్ముకుంటే మృత్యువు మరీ భయంకరంగా ఉండకుండా అనుగ్రహిస్తాడు. అంతకన్నా కావలిసినది ఏముంటుంది ఎవరికైనా.

అమ్మవారి ఒకనామం " సర్వవ్యాధి ప్రశమన్యైనమః " అని. అంటే వ్యాధి తీవ్రతను తగ్గించేది అని. వ్యాధులు రాకుండా చూసుకోవలసినది జీవులే మంచి కర్మలు మాత్రమే చెయ్యడం ద్వారా. 

గరికిపాటివారు తరచూ చెబుతూంటారు " దేవతలకి, గ్రహాలకి మనమీద కోపం ఎందుకుంటుందండి " అని. జీవుల చెడుకర్మలే వ్యాధులుగా పీడిస్తాయి.

" పూర్వజన్మ కృతంపాపం వ్యాధిరూపేణ బాధితా ". వ్యాధి కూడా అమ్మవారి అనుగ్రహమే. జీవుల చెడుకర్మఫలాన్ని తొలగించి ముక్తిని ఇవ్వడానికి ఆ రూపంలో అనుగ్రహిస్తుంది. ఎంత అద్భుత భావన మన ఋషులది.

" అనాయాసేన మరణం

  వినా దైన్యేన జీవనం,

  దేహాంతే తవ సాయుజ్యం  

  దేహిమే పరమేశ్వరా "

( సాయుజ్యం బదులుగా సాన్నిధ్యం అని కూడా చదువుతూంటారు )

ఎవరయినా సుఖమరణాన్నే కోరుకుంటారు. 

ఒకాయన సాయంత్రం 4.30 కి కాఫీత్రాగి రోజూలాగే పార్కుకి వెళ్ళి వాకింగ్ చేసి స్నేహితులతో ముచ్చట్లు కానిచ్చి 6.30 గం కి ఇంటికొచ్చి స్నానం చేసి ఓ అరగంట స్తోత్రపారాయణ చేసుకుని పలహారం కానిచ్చి భార్యతో రేపు కూర ఏమిటీ లాంటి విషయాలు కూడా మాట్లాడి రోజూలాగే అమ్మాయి అబ్బాయిలతో ఓ అరగంట ముచ్చట్లు కానిచ్చి రోజూ చూసే సీరియల్స్ చూసి వార్తలు కూడా చూసేసి " రేపు బేంకుకి వెళ్ళాలి లేటెష్ట్ ఫొటోలు ఇమ్మన్నారు మన ఇద్దరివీ, జ్ఞాపకం చెయ్యి " అని భార్యతో చెప్పి టేబ్లెట్ వేసుకుని పడుకుంటాడు. పొద్దున్న ఆవిడ " ఇదేమిటి ఇంకాలేవలేదు ఈయన, ఈపాటికి లేచి ఫ్రిడ్జిలోంచి పాల పేకెట్ తీసి బయటపెట్టేవారు " అని అనుకుంటూ లేపుదామని మీద చెయ్యి వేసి ఉలిక్కిపడుతుంది ఆయన శరీరం చల్లగా తగిలేటప్పటికి. పండిపోయిన దోసపండు ముచికనుండి ఊడిపోవడం అంటే అదే. దానినే రుద్రుడు అనుగ్రహించేది నమ్ముకున్నవారికి.

అసలు భాగ్యం అంటే అదే.‌ చనిపోయే రోజు కూడా నోటికి హితమయినది తిని, ఇష్టమయిన నామజపం చేసుకుని, ఇష్టమయిన కార్యక్రమాలు చూసుకుని కుటుంబ సభ్యులకు, బంధువులకు కూడా ఏ అసౌకర్యం లేకుండా ఈ లోకం నుండి నిష్క్రమించడం. 

సర్వే జనాః సుఖినో భవంతు.

ఏతత్ సర్వం శ్రీశివార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ