శ్రీలక్ష్మీదేవి జయంతి, హోళీ నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" తాం మ ఆవహ జాతవేదో
లక్ష్మీమనపగామినీం "
- శ్రీసూక్తం.
ఇక్కడ " లక్ష్మీమనపగామినీం " అని ప్రార్ధిస్తాం. " అనపగామినీం " అంటే తిరిగి వెనక్కు వెళ్ళనటువంటిది. అటువంటి సంపదను ఇయ్యమని అమ్మవారిని కోరుకోవాలి.
శ్రీసూక్తంలో అమ్మవారిని ప్రార్ధిస్తూ " లోకైక దీపాంకురాం ( లోక+ఏక+దీప+అంకురాం ) అంటాం అంటే " లోకాలన్నింటికీ ఒకే ఒక్క దీపమై ఉన్నది " అని. దీపం అంటే జ్ఞానం. లక్ష్మీదేవి జ్ఞానప్రదాత. చీకటి పోవాలంటే దీపం కావాలి. అజ్ఞానాంధకారం పోవాలంటే దీపలక్ష్మి అనుగ్రహం కావాలి.
" ధనమగ్ని ర్ధనంవాయుః
ధనంసూర్యః ధనంవసుః
ధనమింద్రో బృహస్పతిః
వరుణం ధనమశ్నుతే "
- శ్రీసూక్తం
" అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యుడు, అష్టవసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు తమతమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు తల్లీ " అని. ఎంత అద్భుతం అమ్మవారి ఐశ్వర్యం.
ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు " ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యములతో జీవించుము " అని అంటారు. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యములంటే తెలిసినవే. భోగాలంటే సౌకర్యాలూ, పనిమనుషులు మొ.గునవి. మరి భాగ్యం ఏమిటి. ముందర నాలుగూ అంటే " ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం భోగాలు " ఉన్నా సుఖం ఉండదు చాలామందికి.
" అశాంతస్య కుతః సుఖం " - ఎప్పుడూ " అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడిది " అన్నారు పరమాత్మ గీతలో ( భ.గీత 2:66 ).
" భాగ్యం " అంటే ఈ శాంతే. ఇది ఉన్న మనిషే సుఖంగా ఉండగలడు, ఏది లేకపోయినా. ఈ శాంతిని కలుగచేసేది అమ్మవారు లక్ష్మీదేవి. ఆవిడ సంపదని ఇస్తుంది అంటారు. నిజమయిన సంపద ఈ శాంతే.
శ్రీలక్ష్మీ సహస్రనామాల్లో " సదదృష్టప్రదాయినీ/దురదృష్టవిఘాతినీ " అని చదువుతాం. మంచి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది, దురదృష్టాన్ని పోగొడుతుంది అమ్మవారు లక్ష్మీదేవి అని.
లక్ష్మీదేవి తను ఎక్కడ ఎక్కడ ఏరూపంలో ఉంటానో చెబుతూ ఇంటిలో " గృహలక్ష్మి " గా ఉంటానని చెప్పింది. అందుకనే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.
కోరిక ధర్మబద్ధంగా ఉంటే అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారు. అమ్మవారు మనం కోరుకున్నదాని కన్నా ఎక్కువ ఇచ్చి మాయ చేస్తారు. తట్టుకోవడం కష్టం, బురదలో కూరుకుపోతాం. జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు శ్రీలక్ష్మీదేవి జయంతి, హోళీ. పరమపవిత్రమయిన రోజు. జీవితాన్ని సుఖమయం చేసే " భాగ్యము " ను అందరికీ ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీమహాలక్ష్మీదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment