హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచడం మేమిటి?- చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" సహస్ర సూర్యతయా భాంతి - అంతరిక్షంలో వేలసూర్యులు ప్రకాశిస్తున్నారు " - వేదం.
హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోయి సముద్రంలో దాచడం మహావిష్ణువు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుని చంపి భూమిని రక్షించడం చదివాం, విన్నాం మనం.
ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యమే. భూమిని భూమిమీద ఉన్న సముద్రంలో దాచటమేమిటి, కట్టుకథ అని. అసలు అర్ధం ఉందా ఈ చెప్పే విషయానికి అని కూడా కొందరు విమర్శిస్తూ ఉంటారు. తప్పు లేదు.
మన వాజ్మయంని అర్ధం చేసుకోవడానికి చాలా విద్వత్తు ఉండాలి. అది లేనప్పుడు మన ఋషుల విద్వత్తు మీద నమ్మకమయినా ఉండాలి. ఈ రెండూ లేనివారికి అలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
మన తెలుగు అమ్మాయి రాగదీపిక పుచ్ఛా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. అమెరికాలో ఖగోళంమీద పరిశోధనలు చేస్తూంది. ముఖ్యంగా కృష్ణబిలాల మీద. విశ్వంలో ఉన్న 4 కోట్ల పాలపుంతలను పరిశీలిస్తున్నారుట వీరు. అంటే ఇంకా ఎన్ని పాలపుంతలు ఉన్నాయో విశ్వంలో. కనీసం 2000 కోట్ల పాలపుంతలు ఉండి ఉంటాయని ప్రస్తుత అంచనా. ప్రస్తుతానికి 2500 కృష్ణబిలాలు పరిశీలించారు అని తెలుస్తూంది.
విశ్వంలో ఇంకా ఎన్ని వింతలు ఉన్నాయో. మన భూమి మనిగిపోయేంత పెద్ద పెద్ద సముద్రాలు కలిగిన గ్రహాలు ఎన్ని ఉన్నాయో విశ్వంలో. అలాంటి ఏ గ్రహంమీద ఉన్న ఏ సముద్రంలో దాచాడో హిరణ్యాక్షుడు భూమిని తీసుకుని పోయి.
పోతనగారి మహాభాగవతంలో ఓ చక్కని పద్యం ఉంది:
" ఇంతింతై వటుఁడింతయై
మరియుఁ దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాభ్రమున
కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై
ధ్రువుని పైనంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు
బ్రహ్మాండాంత సంవర్ధియై "
ఇంతైనాడు, మరింతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినంతైనాడు, సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు
అసలు ఊహిస్తూంటేనే ఎంత అద్భుతంగా ఉందో ఈ వర్ణన.
వామనుడు మూడు వరాలు దానం పుచ్చుకున్నాక ఆకాశంలోకి పెరిగిపోతూన్నప్పుడు మొదట సూర్యుని తరువాత చంద్రుని దాటారు అన్నారు భాగవతంలో. అదెలా?. చంద్రుడు భూమికి దగ్గర కదా. తరువాత కదా సూర్యుడు. దీని అర్ధం భాగవతంలో చెప్పిన ఈ చంద్రుడు, అమ్మవారు - శివుని శిరస్సులో ఉన్న చంద్రుడు వేరే. మనం రోజూ చూసే చంద్రుడు కాదు. అలాగే విశ్వంలో వేరే సముద్రాలు, భూమి కూడా మునిగేటటువంటివి ఉండి ఉండవచ్చు. వాటిలో ఒకదానిలో భూమిని దాచి ఉంచవచ్చు.
మన ఋషులు తమ దివ్యశక్తులతో ఇటువంటి విషయాలన్నింటినీ చూసి/గ్రహించి ఉంటారు.
మనకు ఇప్పుడు లభ్యమయే వాజ్మయం మన ఋషులు ఇచ్చిన వాజ్మయంలో పదో వంతు కూడా లేదు. అంతా నాశనం చెసేసారు అందరూ కలిసి. ఆ వాజ్మయం అంతా పూర్తిగా ఉండి ఉంటే ఇటువంటి సందేహాలకు సమాధానాలు దొరికి ఉండేవి.
మన ఋషుల విద్వత్తును అర్ధం చేసుకోవడానికి ఇప్పటి శాస్త్రజ్ఞులకు కనీసం ఇంకో పదివేల సంవత్సరాలు పడుతుంది. మన ఋషుల విద్వత్తుకు సాటి లేదు, రాబోదు.
హమారా సనాతనధర్మ మహాన్ - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment