మాయను తప్పించుకోలేమా - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
"దైవీ హ్యేషా గుణమయీ
మమ మాయా దురత్యయా"
- భ.గీత 7:14
" నామాయ నుంచి తప్పించుకోవడం కష్టమే సుమా " అన్నారు కృష్ణపరమాత్మ గీతలో.
" మాయ " అంటే మభ్యపెట్టడమో, మోసమో కాదు. మిధ్యకూడా కాదు. అది ఒక అద్భుతప్రక్రియ. దానివల్లనే ఈ సృష్టి, ప్రపంచము, జీవితమూ సుందరంగా ఆనందమయంగా కనిపిస్తున్నాయి. ఇది " మాయ " అని తెలుసుకున్నవాడు జ్ఞాని.
అజ్ఞాతవాసం అయిపోయాక దృపదరాజు యొక్క పురోహితుడిని దృతరాష్ట్రుడి వద్దకు రాయబారానికి పంపిస్తాడు ధర్మరాజు, " మారాజ్యాన్ని మాకు ఇప్పించండి, అందరం సంతోషంతో గడపవచ్చు " అని. దృతరాష్ట్రుడు మేమందరం ఆలోచించుకుని మా రాయబారిని పంపిస్తాం అని పంపించేస్తాడు.
సంజయుడిని పిలిచి " నువ్వు సమర్ధుడివి, వెళ్ళి ధర్మరాజుకి తియ్యటి మాటలు చెప్పి అతని మనస్సులో యుద్ధం అనే ఆలోచనే లేకుండా చేసిరా " అంటాడు.
సంజయుడు వెళ్ళివచ్చి కురుసభలో అందరి సమక్షంలో ధృతరాష్ట్రుడికి ఏమి జరిగిందో ఇలా చెబుతాడు:
" ధర్మరాజు సంధే కోరుతున్నాడు. అర్జునుడు ఏదో అనబోతూంటే చిరునవ్వుతో వారించి కృష్ణుడు ఇలా అన్నారు నాతో ' సంజయా, మీ ప్రభువు నిండుకొలువులో ఉండగా సభ్యులందరూ వినేటట్లుగా చెప్పవలసిన మాటలు విను. శాంతమూర్తి అయిన ధర్మజుడు ఆగ్రహిస్తే అంతా తగలబడడమే. ప్రమాదం ముంచుకువస్తూంది కనుక వారికి కొన్ని విషయాలు చెప్పు.
' యోగ్యులయిన వారిని పిలిపించి చెయ్యవలసిన దానధర్మాలు చేసుకోమను. ఆశ్రితులకు ఇవ్వవదలచుకున్నవి ఇచ్చేసుకోమను. అనుభవించవలసిన భోగాలేమయినా ఉంటే త్వరగా అనుభవించమను. భార్యాబిడ్డలకు చెయ్యవలసిన సదుపాయాలన్నీ త్వరగా చేసుకోమను. ఇంకా ఏమేమి చెయ్యాలో చేసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండమను.
పదమూడు సం.ల క్రితం మీ సభాభవనంలో అవమానాలు పడలేక దిక్కులేనిదానిలా విలపిస్తూ నన్ను స్మరించింది ద్రౌపది. నాటినుంచీ ఆమె కోరిక తీర్చనందుకు బాధపడుతున్నాను. ఇప్పుడా ఇల్లాలిని పరాభవించిన వారందరికీ తగిన శాస్తి చేసే సమయం వచ్చేసింది " అని.
కృష్ణుడు అలా చెప్పమన్నారని చెప్పాడు సంజయుడు. దృతరాష్ట్రుడు " మరి అర్జునుడు ఏమీ అనలేదా " అని అడిగితే " మారాజ్యం మాకు తిరిగి ఇవ్వకపోతేనే మాకు మంచిది " అన్నాడు అర్జునుడు అని చెప్పాడు.
ఇంతా విని దృతరాష్ట్రుడు అన్నాడు " ఇక్కడ మన సేనాబలం విశేషాలు తెలిసికూడా ధర్మరాజు ఎవరిమీద విశ్వాసంతో యుద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు " అని.
ఇది విన్న సంజయడుకి, భీష్మద్రోణాదులకి అందరికీ మూర్ఛ వచ్చినంత పని అయిందిట. ఎలా చెబుతే దృతరాష్ట్రుడుకి తెలిసివస్తుందని తలలు పట్టుకున్నారుట.
కాలం కలిసిరాకపోతే మాయ కమ్మేస్తుంది, బురదలో కూరుకుపోతారు. సర్వనాశనం చేతులారా కొని తెచ్చుకుంటారు.
ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు- సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment