వీరులు అంటే నేను, నాది అనే భావనను వదిలేసిన వారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" వీరారాధ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 777 వ నామం.
" వీరారాధ్యా " అంటే " వీరులచేత ఆరాధించుబడునది " అని అర్ధం. దీక్ష తీసుకున్న దీక్షితులని వీరులంటారు. అంతే కాని వీరులు అంటే అధికశరీరబలం ఉన్నవారు అని కాదు. దీక్ష తీసుకున్నవారు నియమనిబద్ధతలతో ఉండాలి, అది అంత తేలికకాదు. " నేను, నాది " అన్నది వదిలేయాలి.
" అహం మమ ఇత్యభిమాన విరహితః వీరః " అని తెలియచేస్తున్నాయి ఉపనిషత్తులు. నేను నాది అనే అభిమానాలను వదిలేసినవారిని వీరులు అన్నారు.
అయ్యప్పదీక్ష తీసుకున్నవారిని చూస్తూంటాం. సూర్యోదయానికే ముందరే స్నానం, పూజలు, నల్లబట్టలు, పాదరక్షలు వేసుకోకపోవడం, సాత్వికమైన ఆహారం, మృదుభాషణ - ఇలా ఎన్నో నియమాలతో 40 రోజుల దీక్ష అంటే అంత తేలికకాదు. అందుకే వారిని చూడగానే నమస్కరించి గౌరవించాలనిపిస్తుంది.
దీక్ష తీసుకున్నవారిని ఎవరయినా సహాయం కోరితే అది వారి పరిధిలో ఉన్నట్లయితే నాకు కుదరదు, సమయంలేదు, వీలుకాదు అని చెప్పకూడదు అని శాస్త్రోక్తం.
ఇలా దీక్ష తీసుకున్నవారు ఏమి చేస్తారు. కొంతమంది సాయంత్రం అయేసరికి ఓ చక్కని ఏకాంతప్రదేశానికి చేరుకుంటారు. ఓ దీపం అగరువత్తి వెలిగించి భజనలు చేస్తారు. దేవుళ్ళగురించి చక్కటి విషయాలు మాట్లాడుకుంటారు. దేవుడికి నివేదన చేసిన ప్రసాదంని నలుగురికీ పంచుతారు. సాత్వికమయిన ఆ ప్రసాదాన్ని భుజిస్తారు.
" యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకమ్ "
ఎక్కడ రామకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమ చేతులు జోడించి, నీళ్ళు నిండిన కళ్ళతో కూర్చుని ఉంటారుట.
భజనలు జరిగే చోట ఆఆ దేవీదేవతలు వచ్చి కూర్చుని విని ఆనందిస్తారు.
ఇలా చేయడంవల్ల వీరుల మనస్సు ప్రశాంతతను పొందుతుంది, ఆనందం కలుగుతుంది. అమ్మవారు సంతోషిస్తారు. సమాజం సంతోషంగా ఉంటుంది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment