సుఖం అంటే కోరికలు తగ్గించుకోవడం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సుఖప్రదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 192 వ నామం.
" సుఖప్రదా " అంటే అన్నివిధముల సుఖములను ఇచ్చునది అని భాష్యం చెప్పారు.
సుఖం అంటే ఏమిటి?. చాలామంది భావన సంపదలు ఉంటే చాలు అంతా సుఖమే అనుకుంటారు.
కఠోపనిషత్తు సంపదలు సుఖసంతోషాలను కలిగించవని తెలియచేస్తూంది. నచికేతుడు ఆత్మజ్ఞానాన్ని, తత్వాన్ని తెలియచేయమని కోరతాడు యముడిని. ఈ కోరికను విరమించుకుంటే సమస్త సంపదలు, భోగాలు ఇస్తానంటాడు యముడు. నచికేతుడంటాడు:
" న విత్తేన తర్పణీయో మనుష్యో
లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్వా "
- 1.1.27
" సంపదతో మానవుడికి తృప్తికలుగదు. ఒక సంపద సమకూరితే మరొక సంపద కావాలనిపిస్తుంది. నీ దర్శనం సకల సంపదలూ కలుగజేసేదే కనుక నాకు సంపదల మీద ఆశలేదు " అంటాడు.
నరసింహస్వామి ప్రహ్లాదుడితో అంటారు " అందరి కోరికలు తీర్చేవాడిని నేను, నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాను, నీ పట్ల ప్రీతుడయి ఉన్నాను, ఏదయినా కోరిక కోరుకో " అని. అప్పుడు ప్రహ్లాదుడు " మా మాం ప్రలోభయా - నన్ను ప్రలోభపెట్టకు " అంటాడు.
కోరిక కలుగుతే శరీరమమకారం పెరుగుతుంది, బంధాలు పెంచుతుంది. ఊబిలోకి లాగేస్తుంది. ఓ కోరిక అంటూ మొదలవుతే అది అక్కడితో ఆగదు.
అమ్మవారు సుఖాన్ని ఇస్తారంటే అర్ధం ఈ కోరికలు తగ్గేలా చేస్తారు అని. ఇంద్రియనిగ్రహం ప్రసాదిస్తారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment