కోరిక ఉన్నస్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకుని వెళ్ళేలా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" కామదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 63 వ నామం. 

" కామదాయినీ " అంటే కోరిన కోరికలను తీర్చునట్టిది. ఆమె మాతృమూర్తి కనుక మనం ఏ కోరిక కోరినా తీరుస్తారు. కాని అది ధర్మబద్ధంగా మనకు మంచి చేసేది అయితేనే అనుగ్రహిస్తారు. పిల్లవాడు అడిగినా, ఏడ్చినా సూది, కత్తి లాంటివి తల్లి ఇవ్వదు. మరీ మారాం చేస్తే రెండు తగిలిస్తుంది కూడా.

భాగవతంలో యయాతి అంటారు " కోరికలు తీర్చుకోవడం ఎలాంటిది అంటే అగ్నిని ఆర్పడానికి నెయ్యి పోయడం లాంటిది " అని. నెయ్యి పోస్తూ ఉంటే అగ్ని ఆరడం అనేది ఉండదు. కోరిక కూడా అటువంటిదే. ఒకటి తీరగానే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది.

" ఆప్తకామా, పూర్ణకామా " అంటే కోరికలు లేని స్థితి ఎప్పుడు వస్తుందంటే మనస్సు ఆనందంతో నిండిపోయినప్పుడు. కుండ నిండిపోయాక నీళ్ళు పోయము కదా. మనస్సు ఖాళీగా ఉంటేనే కోరికలు పుడుతూ ఉంటాయి. అందుకే అమ్మవారి స్మరణతో మనస్సు నింపుకోవాలి. అది అంత సులభం కాదు. బంధాలు కూడా కోరికలను పెంచుతాయి.

ప్రహ్లాదుడి మనస్సంతా నారాయణుడితో నిండిపోయింది. నిప్పులో పడేసినా, ఏనుగులు త్రొక్కినా, నాగుపాములు కాటేసినా బాధేముంది. మనస్సు ఖాళీగా ఉంటేనే కోరికలు, ఆనందాలు, బాధలూను. 

ఓ సమయంలో కుంతిని కృష్ణపరమాత్మ " అత్తా, ఎన్నో కష్టాలు అనుభవించావు, ఏదయినా మంచి కోరిక కోరుకో, నీ కోరికను తీరుస్తాను " అంటే కుంతి మూడు కోరికలు కోరుతుంది:

1. ఎల్లప్పుడూ ఆపదలు కలిగేలా చెయ్యి. 

    ఎప్పుడు ఆపదలు కలిగినా నువ్వు 

    స్ఫురణకు వస్తావు. అది మాకు భాగ్యం.

2. మా వంశమునందు కాని, నా

    సంతానమునందు కాని 

    మమకారంలేకుండా చెయ్యి. ఈ " నా " 

    అనేది భయంకరమైనది.    

    పునర్జన్మ  హేతువు.

3. నా మనస్సు ఇతర విషయాలవైపు 

    మరలకుండా గంగానది    

    సముద్రంవైపే ప్రయాణం    

    చేస్తూన్నట్లుగా నీపైనే 

    నిమగ్నమయేటట్లుగా అనుగ్రహించు. 

ఎంతటి అద్భుతమైన కోరికలు. కష్టం అనేది ఒక వరం. అప్పుడే దేముడు గుర్తుకు వచ్చేది ఎవరికయినా. 

కోరిక మనం ఉన్నస్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకుని పోయేలా ఉండాలి. అటువంటి కోరికలను అమ్మవారు తప్పకుండా తీరుస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ