మన క్రితం జన్మల గురించి వచ్చే జన్మల గురించి అమ్మవారికి ఎరుకే - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" సర్వజ్ఞా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 196 వ నామం.
" సర్వజ్ఞా " అంటే సమస్తమును తెలిసినది. త్రికాలదర్శి. ఒక్కో జీవుడు ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాడు. మరి వాడి కర్మఫలాలన్నిటినీ ఎంత జాగ్రత్తగా లెక్క చూడాలి. పుణ్యాత్ములను అనుగ్రహించడం, పాపులను శిక్షించడం చేస్తూండాలిగా. పాపపుణ్యాలు రెండూ నశించిన వారికి ముక్తిని ప్రసాదించాలి కూడా.
ముండకోపనిషత్తు ఇలా తెలియచేస్తూంది:
" యః సర్వజ్ఞః సర్వవిద్యస్య
జ్ఞానమయం తపః " - 1.1.9
" భగవంతుడు అన్నీ తెలిసినవాడు, సర్వసాక్షి మరియు సర్వజ్ఞుడు. ఆయన తపస్సు జ్ఞానమయము ” అని.
మనం న్యాయస్థానాలలో చూస్తూంటాం. చిన్న చిన్న సమస్యలకే పరిష్కారాలకు ఏళ్ళ తరబడి అవుతూంటుంది. అమ్మవారు అలా చేయనివ్వరు కదా. ఎంత నిక్కచ్చిగా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు.
అమ్మవారి శక్తులు అనంతం. మన ఊహకు అందవు.
కఠోపనిషత్తు ఇలా తెలియచేస్తూంది:
" నైషా తర్కేణ మతిరాపనేయా "
- 1.2.9
“ భగవంతుడు మన బుద్ధి యొక్క తర్కమునకు అతీతుడు ” అని.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" వేదాహం సమతీతాని
వర్తమానాని చార్జున,
భవిష్యాణి చ భూతాని
మాం తు వేద న కశ్చన "
- భ.గీత 7:26
" అర్జునా! నాకు భూత, వర్తమాన, భవిష్యత్తు అంతా తెలుసు, మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు; కానీ నేను ఎవరికీ తెలియను " అని.
ఏ విషయం ఎలా చేస్తారో, ఎలా ముగిస్తారో ఊహకు కూడా అందదు. అంత అద్భుతంగా దోషరహితంగా నడుపుతున్నారు సృష్టిని అమ్మవారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
AATMA TWAM GIRIJAA MATIHI SAHACHARAA PRAANAA SHAREERAM GRIHAM POOJA TE VISHYOPA BHOGA RACHANA NIDRA SAMAADHI STITHIHI SANCHARA PADAYO PRADAKSHINA VIDHIHI STOTRANI SARVA GIRO YADYAT KARMA KAROMI TATTA DAKHILAM SHAMBHO TAVARAADHANAM.
ReplyDeleteశంకరాచార్య విరచిత " శివ మానసపూజ"👌
ReplyDelete