అమ్మవారికి మనమీద ఎప్పుడూ కరుణే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సాంద్రకరుణా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 197 వ నామం .
" సాంద్రకరుణా " అంటే ఘనమయిన దయ కలది. అమ్మవారి దయ అపారమైనది. అమ్మవారి చూపులు చంద్రుడి వెన్నెలలా చల్లగా ఉంటాయి, మాటలు అమృతపు గుళికల్లా ఉంటాయి. భక్తులను అన్నివేళలా అన్నివిధాలా ఆదుకుని ఆనందంగా ఉండేలా చేస్తారు.
రాసలీలకు ముందు " కృష్ణా, మిమ్మల్ని ఓ విషయం అడగవచ్చా " అని అడుగుతారు గోపికలు. కృష్ణుడు " అడగండి " అనగానే వారు అంటారు:
ఈ ప్రేమలు ఆశ్చర్యకరంగా ఉంటాయి:
1. ఎదుటి వారు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు కొందరు.
2. ఎదుటి వారు ప్రేమించకపోయినా
ప్రేమిస్తారు కొందరు.
3. ఎదుటి వారు ప్రేమించినా,
ప్రేమించకపోయినా ప్రేమించరు కొందరు.
ఈ ముగ్గురిలో మీరు ఎవరు అని అడుగుతారు కృష్ణుడిని. ఎంత చక్కటి ప్రశ్న.
అప్పుడు కృష్ణుడు అంటారు:
" నాహం తు సఖ్యో భజతోఽపి జంతూన్
భజామ్యమీషామనువృత్తి వృత్తయే,
యథాధనో లబ్ధధనే వినష్టే
తచ్చింతయాన్యన్నిభృతో న వేద "
- భాగవతం 10(1):31:20
" పైవారిలో నేను ఎవరినీ కాను. ఎందుకంటే నాకు కరుణ ఒక్కటే తెలుసు. నా భక్తుల మీద నాకు అపారమయిన కరుణ/దయ. ఈ భౌతిక బంధాలన్నిటినీ త్రెంచుకుని నన్ను ఆశ్రయించిన భక్తులకు అఖండ ఖ్యాతిని, ముక్తిని కలుగచేయడమే నా పని " అంటారు కృష్ణుడు.
అమ్మవారు అవ్యాజకరుణామూర్తి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment