నిర్మలమయిన మనస్సుతో అమ్మా అంటే చాలు అనుగ్రహిస్తారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" బ్రాహ్మీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 675 వ నామం.
" బ్రాహ్మీ " అంటే జ్ఞానస్వరూపురాలు అని భాష్యం చెప్పారు. అమ్మవారు జ్ఞానప్రదాత.
ఆదిశంకరులు " బ్రహ్మసత్యం జగన్మిధ్య, జీవో బ్రహ్మ ఏవ నపరః " అన్నారు. అంటే బ్రహ్మ సత్యం, జగత్ మిధ్య, జీవుడు బ్రహ్మ వేరుకాదు ( ఒకరే ) అని. మాయ కారణంగా జీవుడు నిజంగా తను ఎవరో అది తాను కాదనుకుంటాడు, తను ఏదికాదో అది తాను అనుకుంటాడు.
జ్ఞానం అంటే అమ్మవారు సత్యం, ఈ కనబడేదంతా అసత్యం అని తెలుసుకోవడం. అలా తెలుసుకోవడమే అసలు విద్య. మిగతా చదువులన్నీ అవిద్యలే. అమ్మవారి రూపం, గుణగణాలు, శక్తులు వంటి వాటిని తెలుసుకోవడం, కీర్తించడం జ్ఞానకాండ క్రిందకు వస్తాయి.
వేదాలలో ముఖ్యంగా కర్మకాండ, జ్ఞానకాండ ఉన్నాయి. ఆదిశంకరులు వచ్చేటప్పటికి కర్మకాండ ఉచ్ఛస్థితిలో ఉంది. ఈ కర్మకాండ కామదాయిని, కోరికలు తీర్చేది. దీనిలో శతృవు నాశనమవాలని కోరుతూ చేసే అభిచారమంత్రాల వంటివి కూడా ఉన్నాయి. ఆదిశంకరులు ఈ కర్మకాండ శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడుకున్నది. రాబోయే గడ్డుకాలంలో సామాన్యజనులు బ్రతుకుతెరువు కోసమే ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తుంది. ఇక ఈ కర్మకాండలు చేసే సమయమెక్కడుంటుంది వారికి. అమ్మవారి స్తోత్రమో అష్టకమో శ్లోకమో అయితే తేలిగ్గా చదువుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారు అని భావించి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా దేశమంతా కాలినడకన తిరిగి ఎంతోమంది పండితులతో రాబోయే కాలానికి జ్ఞానకాండయే ఎక్కువ ఉపయోగమని వాదించి ఒప్పించారు. సనాతనధర్మంని పరిరక్షించారు.
దీక్షితార్ శ్యామశాస్త్రి త్యాగయ్య వంటివారే కాకుండా గాయకులు అందరూ కూడా ఈవిధంగానే దేవీదేవతలను స్తుతిస్తూ కీర్తిస్తూ తరించారు, చిరస్మరణీయులు అయారు. వీరికి దేవీదేవతల దర్శనం కూడా కలిగింది. కృష్ణుడు భక్తజయదేవుల, రాముడు పోతనల కావ్యాలలో శ్లోకాలు/పద్యాలు పూరించారు కూడా.
ఆదిశంకరుల కృషి కారణంగా సామాన్యుల మయిన మనమందరం కూడా అమ్మవారి స్తోత్రాలు, అష్టకాలు, నామాలు చదువుకుని మనశ్శాంతిని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment